RBI:రెపో రేటు 5.50 శాతానికి పెంపు

1
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.25 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత RBI రెపో రేటును పెంచడం ఇదే తొలిసారి.

RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాలను వెల్లడించారు. ఆరుగురు సభ్యులతో కూడిన MPC ఏకగ్రీవంగా రెపో రేటు పెంపునకు నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు కొనసాగుతున్న ‘న్యూట్రల్’ విధాన వైఖరిని మార్చి ‘క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్’ వైఖరిని స్వీకరించింది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరగడం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని RBI భావించింది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. ఇది RBI నిర్దేశించిన 4 శాతం లక్ష్యానికి వరుసగా మూడో నెల అధికంగా ఉంది.

అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మాత్రం బలంగా కొనసాగుతోంది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్ల పెంపు అవసరమని RBI భావించినట్లు తెలుస్తోంది.

RBI రెపో రేటును పెంచడంతో బ్యాంకులకు RBI నుంచి తీసుకునే రుణాల వ్యయం పెరిగే అవకాశం ఉంది. దాని ప్రభావంతో బ్యాంకులు గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. ఫలితంగా కొత్త రుణాలు తీసుకునే వారితో పాటు ఫ్లోటింగ్ రేట్‌లో ఉన్న రుణగ్రహీతల EMIలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read:ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌కు స్పందన కరువు..

- Advertisement -