రెపో రేటు పెంపు..పెరగనున్న EMIలు!

1
- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపో రేటు 5.50 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణంపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాయిటర్స్‌ కూడా ధృవీకరించింది.

రెపో రేటు పెంపుతో పాటు ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన వైఖరిని కూడా మార్చింది. ఇప్పటివరకు కొనసాగిన ‘తటస్థ’ విధానానికి బదులుగా ‘క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్’ (Calibrated Tightening) వైపు అడుగులు వేసింది. అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అవసరానికి అనుగుణంగా వడ్డీ రేట్లను దశలవారీగా కఠినతరం చేసే అవకాశం ఉందన్నమాట.

దేశంలో ధరలపై పెరుగుతున్న ఒత్తిడి ఈ నిర్ణయానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, వర్షపాతం లోటు వంటి అంశాలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతున్నాయి. ఆగస్టులో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.82 శాతానికి చేరింది. ఇది ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువ.

రెపో రేటు పెంపు నిర్ణయాన్ని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ నిర్ణయానికి మద్దతు తెలిపింది. రెపో రేటు పెంపు ప్రభావం గృహ రుణాలపై కూడా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రెపో రేటుతో అనుసంధానమైన ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్లు తీసుకున్న వారికి తదుపరి రీసెట్ సమయంలో వడ్డీ రేటు పెరగవచ్చు. ఫలితంగా నెలవారీ ఈఎంఐ పెరగడం లేదా రుణ కాలపరిమితి పొడిగించడం జరిగే అవకాశం ఉంటుంది.

Also Read:RBI:రెపో రేటు 5.50 శాతానికి పెంపు

బిల్డర్లు, గృహ కొనుగోలుదారులు కూడా ఈ పరిణామాన్ని నిశితంగా గమనించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే వారి రుణ వ్యయం పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ డిమాండ్‌పైనా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

- Advertisement -