ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 365 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత కలిగిన పురుష, మహిళా భారతీయ పౌరులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించాలి.
అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అభ్యర్థి డ్యాష్‌బోర్డ్‌లోకి లాగిన్ కావడం, ఈ-అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం, ఫలితాలను చూడడం వంటి వాటికి ఇవి అవసరం. రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ను మర్చిపోతే వాటిని తిరిగి పొందేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోదు.
విద్యార్హతలు
నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు 12వ తరగతిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విద్యా బోర్డు COBSE గుర్తింపు పొందినదై ఉండాలి. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత అవసరం.
హైజీనిస్ట్-I పోస్టులకు మ్యాట్రిక్యులేషన్, ఐటీఐ లేదా సమానమైన అర్హత ఉండాలి. ఈ అర్హత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు నుంచి పొందినదై ఉండాలి.
యాంత్రిక్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు AICTE గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజినీరింగ్‌లో 3 లేదా 4 సంవత్సరాల డిప్లొమా ఉండాలి. 10వ తరగతి, 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన 2 లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఉన్నవారు కూడా అర్హులు.
వయోపరిమితి
నావిక్ (GD) 01/27, 02/27 బ్యాచ్‌లకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 2005 నవంబర్ 1 నుంచి 2009 మే 1 మధ్య జన్మించి ఉండాలి. యాంత్రిక్ 01/27 బ్యాచ్‌కు 2005 మే 1 నుంచి 2009 మే 1 మధ్య జన్మించినవారు అర్హులు.
నావిక్ (DB) 02/27 బ్యాచ్‌కు 2005 నవంబర్ 1 నుంచి 2009 అక్టోబర్ 1 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హైజీనిస్ట్-I 02/27 బ్యాచ్‌కు 2002 నవంబర్ 1 నుంచి 2009 అక్టోబర్ 1 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఎంపిక ప్రక్రియ
రిక్రూట్‌మెంట్‌లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఒక గంట వ్యవధిలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. UR/EWS/OBC అభ్యర్థులకు కనీసం 40 మార్కులు, SC/ST అభ్యర్థులకు 35 మార్కులు సాధించాలి.
రెండో దశకు ఎంపికైన అభ్యర్థులకు ఐడెంటిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT), అసెస్‌మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. PFTలో 1.6 కిలోమీటర్ల పరుగు, స్క్వాట్స్, పుష్‌అప్స్/సిట్‌అప్స్ ఉంటాయి. పురుషులు, మహిళలకు వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి.
మొదటి రెండు దశల్లో అర్హత సాధించి మెరిట్ ప్రమాణాలను అందుకున్న అభ్యర్థులను మూడో దశకు తాత్కాలికంగా ఎంపిక చేస్తారు. ఈ దశ INS చిల్కాలో జరుగుతుంది. నాలుగో దశలో అభ్యర్థుల ఒరిజినల్ విద్యా, ఇతర ధ్రువపత్రాలను సంబంధిత అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తారు.
Also Read:ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌కు స్పందన కరువు..
జీతభత్యాలు, ప్రయోజనాలు
యాంత్రిక్ పోస్టులకు పే లెవల్-5 కింద రూ.29,200 ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా రూ.6,200 యాంత్రిక్ పే, ఇతర వర్తించే అలవెన్సులు అందుతాయి.
నావిక్ (GD), నావిక్ (DB), హైజీనిస్ట్-I పోస్టులకు పే లెవల్-3 కింద రూ.21,700 ప్రాథమిక వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయి.

