భువీ రీఎంట్రీ..కారణం ఇదేనా?

1
- Advertisement -

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఈ నెలలో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికైన జట్టులో 36 ఏళ్ల భువీకి చోటు దక్కింది. అయితే అతడి రీఎంట్రీ మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ హయాంలో జరగలేదని, సెలెక్షన్ కమిటీలో మార్పుల తర్వాతే మార్గం సుగమమైందని ఓ నివేదిక పేర్కొంది.

గత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ సాధించడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌లో 17 వికెట్లు తీసిన అతడు.. పవర్‌ప్లేలో స్వింగ్, సీమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ అతడిని తిరిగి పరిశీలించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.

సెంట్రల్ జోన్ సెలెక్టర్ రుద్ర ప్రతాప్ సింగ్ భువనేశ్వర్ ఎంపికకు మద్దతు ఇచ్చినప్పటికీ, అగార్కర్ నుంచి తగినంత మద్దతు లభించలేదని తెలుస్తోంది. అగార్కర్ సెలెక్షన్ కమిటీ నుంచి తప్పుకున్న తర్వాత తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ప్రజ్ఞాన్ ఓజా, ఇతర సెలెక్టర్లను భువీ విలువ గురించి ఒప్పించడం అంత కష్టంగా మారలేదని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేని పరిస్థితుల్లో భువనేశ్వర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది.

భువనేశ్వర్ తన అనుభవంతో యువ పేసర్లు మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లకు కూడా మార్గనిర్దేశం చేయగలడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. వీరిద్దరినీ 2028 టీ20 ప్రపంచకప్‌కు సంభావ్య ఆటగాళ్లుగా చూస్తున్నారు.భువనేశ్వర్ భారత్ తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టీ20ల్లో 90 వికెట్లు సాధించాడు.

అజిత్ అగార్కర్ నిష్క్రమణ తర్వాత, ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రకటించిన తొలి టీ20 జట్టులో భువనేశ్వర్‌కు చోటు దక్కింది. గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైన వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.న్యూజిలాండ్ పర్యటనలో భారత్ అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు ఐదు టీ20లు ఆడనుంది. తొలి రెండు మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్‌లో, మూడో మ్యాచ్ వెల్లింగ్టన్‌లో, నాలుగు, ఐదో మ్యాచ్‌లు ఆక్లాండ్, హామిల్టన్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కూడా భారత్ ఆడనుంది.

Also Read:ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్‌కు స్పందన కరువు..

భారత్ టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

- Advertisement -