ఉక్రెయిన్ వార్..భారతీయులు సురక్షితం

1
- Advertisement -

రష్యా దక్షిణ తీరానికి సమీపంలోని బ్లాక్ సీలో ఓ ఆయిల్ ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ నౌకాదళ డ్రోన్ల దాడిలో ఈ నౌక దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో ట్యాంకర్‌లోని ముడి చమురు సముద్రంలోనే మండిపోయింది. భారీగా ఎగిసిపడిన నల్లటి పొగ రిసార్ట్ నగరం సోచిలోని పలు ప్రాంతాల నుంచి కనిపించింది.

రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఈ ఆయిల్ ట్యాంకర్‌పై బ్లాక్ సీలో దాడి జరిగింది. మంటలు తీవ్రంగా ఉండటంతో తొలుత అగ్నిమాపక సిబ్బంది నౌక వద్దకు చేరుకోలేకపోయారు. అయితే నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. వారంతా భారతీయ పౌరులేనని అధికారులు తెలిపారు.

సోచి నుంచి వెలువడిన వీడియోలు, ఫొటోల్లో సముద్రంలో భారీగా మంటలు కనిపించగా.. ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ ఎగిసిన దృశ్యాలు కనిపించాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కొన్ని బీచ్‌లు, తీర ప్రాంతాలకు ప్రజల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

సిరియస్ ఫెడరల్ టెరిటరీ అధిపతి డిమిత్రి ప్లిష్కిన్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగిన విషయాన్ని ధ్రువీకరించారు. ప్రజల భద్రత దృష్ట్యా సిరియస్ ప్రాంతంలోని బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. గాలి, నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్పారు.ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలు మూసి ఉంచాలని అధికారులు సూచించారు. గాలి, నీటి పరిస్థితులను పర్యవేక్షించేందుకు రష్యా వాతావరణ శాఖ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.

Also Read:కేటీఆర్‌ సాయంతో సైక్లింగ్‌లో స్వర్ణం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్లాక్ సీ ప్రాంతంలో ఇంధన మౌలిక వసతులు, వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల రొమేనియా తీరానికి సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన సరుకులను తీసుకెళ్తున్న ధాన్యం నౌకలను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు రష్యా చమురు మౌలిక వసతులపై ఉక్రెయిన్ దాడులు చేస్తోంది.

- Advertisement -