కేటీఆర్‌ పాస్‌పోర్టు జప్తుపై తప్పుడు వార్త..లీగల్ నోటీసు

4
- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్తపై కేటీఆర్‌ లీగల్ నోటీస్ పంపించారు. సెప్టెంబర్‌ 29న ప్రచురితమైన ఆ వార్త వాస్తవాలకు విరుద్ధంగా, పాఠకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని నోటీసులో పేర్కొన్నారు.

కేటీఆర్‌ తరఫు న్యాయవాది ఎన్‌. లలితారెడ్డి సెప్టెంబర్‌ 30న ఈనాడు ఎడిటర్‌, పబ్లిషర్‌, ప్రింటర్‌, రెసిడెంట్‌ ఎడిటర్‌, సంబంధిత రిపోర్టర్‌కు న్యాయ నోటీసు పంపించారు. వాస్తవానికి ఏసీబీ దర్యాప్తు అధికారి ప్రత్యేక కోర్టులో కేటీఆర్‌ పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మెమో మాత్రమే దాఖలు చేశారని, దానిని కోర్టు ఉత్తర్వుగా పేర్కొనడం సరికాదని నోటీసులో స్పష్టం చేశారు.

కేటీఆర్‌ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని నోటీసులో పేర్కొన్నారు. అదే సమయంలో రీజినల్‌ పాస్‌పోర్టు కార్యాలయం సెప్టెంబర్‌ 28న పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్‌ 10(3)(e) కింద షోకాజ్‌ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు ఇప్పటికే పాస్‌పోర్టు జప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్త ప్రచురించడం ద్వారా కేటీఆర్‌పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని న్యాయవాది పేర్కొన్నారు.

వార్తకు ఆధారమైన సమాచారం, మూలాలు ఏమిటో వెల్లడించాలని, సంబంధిత కోర్టు రికార్డులు లేదా ఆదేశాలను రిపోర్టర్‌ పరిశీలించారా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. అలాగే వార్తకు సంబంధించిన వాట్సాప్‌ సందేశాలు, ఈమెయిల్స్‌, నోట్స్‌, రికార్డింగ్స్‌, పత్రాలు, డ్రాఫ్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ రికార్డులను భద్రపరచాలని సూచించారు.

Also Read:అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’

- Advertisement -