భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.సోమవారం తెల్లవారుజామున తిరుమలకు చేరుకున్న శిఖర్ ధావన్ దంపతులు, స్వామివారిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధావన్ దంపతులకు శాస్త్రోక్తంగా దర్శన ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలు అందించారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ధావన్ దంపతులకు ఆశీర్వచనం చేయగా, టీటీడీ (TTD) అధికారులు స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన ధావన్‌ను చూసేందుకు భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ధావన్ కూడా అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తూ వారితో ఫొటోలు దిగారు.
Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ… శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తమ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి సహకారం అందించిన టీటీడీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

