Gen Z:కాంగ్రెస్‌ వైపా..బీజేపీ వైపా!

1
- Advertisement -

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపడుతున్న ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల నాదం) కార్యక్రమాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇండోర్, పుణే, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్, కోటా వంటి నగరాల్లో విద్యార్థులతో రాహుల్ నేరుగా ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఉద్యోగాల అభద్రత, పేపర్ లీకేజీలు, శిక్షణ సంస్థల వేధింపులు వంటి అంశాలపై మాట్లాడటంతో జెన్ జెడ్ (Gen Z) యువత రాహుల్ గాంధీ వైపు కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. అయితే, విద్యార్థుల నుంచి లభిస్తున్న ఈ మద్దతు కాంగ్రెస్ పార్టీకి నేరుగా ఓట్లుగా మారడం లేదని ఇటీవల జరిగిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ (DUSU) ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి.

ఢిల్లీ వర్సిటీ (DUSU) ఎన్నికల పాఠంపార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో నిరుద్యోగం, విద్యావ్యవస్థ లోపాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టిన రాహుల్ గాంధీ ప్రతిష్ట పెరిగినప్పటికీ DUSU ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం (NSUI) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విద్యార్థులు మళ్లీ ఏబీవీపీ (ABVP) వైపే మొగ్గు చూపడం కాంగ్రెస్‌కు పెద్ద రియాలిటీ చెక్‌లా మారింది.

‘భారత్ జోడో యాత్ర’, ‘ఛాత్రోన్ కీ గూంజ్’ల ద్వారా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీకి బలమైన నెట్‌వర్క్ లేకపోవడం పెద్ద మైనస్. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయకుండా కేవలం ఎన్జీవో తరహా కార్యక్రమాలు చేపడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

అభిప్రాయాలు చెప్పడానికి, సోషల్ మీడియాలో మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్న నేటి తరం యువత (Gen Z).. ఓటింగ్ విషయానికి వచ్చేసరికి పక్కా వ్యూహం మరియు క్షేత్రస్థాయి సదుపాయాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కేవలం నాయకుడి క్రేజ్ మాత్రమే కాకుండా, బూత్ స్థాయిలో ఓటర్లను తరలించే వ్యవస్థ, డిజిటల్ టెక్నాలజీ, మైక్రో మేనేజ్‌మెంట్ ఉన్న పార్టీల వైపే యువత మొగ్గు చూపుతోంది.

Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!

దేశ జనాభాలో దాదాపు 26% ఉన్న జెన్ జెడ్‌ను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పటికే తమ వ్యూహాలను విస్తృతం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ తన కార్యక్రమాలతో యువతను ఆకర్షిస్తున్నప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో రీబిల్డ్ చేయకపోతే ఈ పాపులారిటీ ఎన్నికల విజయాలుగా మారదని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.

- Advertisement -