ఉత్తరప్రదేశ్ నుండి 10 రాజ్యసభ స్థానాలు, ఉత్తరాఖండ్ నుండి ఒక స్థానానికి సంబంధించి ప్రస్తుత సభ్యుల పదవీకాలం నవంబర్ 2026తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ 11 స్థానాలకు ద్వివార్షిక ఎన్నికలతో పాటు, పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (సెప్టెంబర్ 22) షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల ప్రక్రియ కోసం సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ విడుదల కానుండగా, అక్టోబర్ 6 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు.
అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఉపసంహరణకు అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 16న ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5:00 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి అక్టోబర్ 19 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.రిటైర్ కానున్న ఎంపీల వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ నుండి నవంబర్ 25న 10 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది.
ప్రస్తుతం వీటిలో 8 స్థానాలు బీజేపీ చేతిలో ఉండగా, సమాజ్‌వాదీ పార్టీ (SP) మరియు బహుజన్ సమాజ్ పార్టీ (BSP)ల వద్ద ఒక్కో స్థానం ఉంది. బీజేపీకి చెందిన దినేష్ శర్మ, హర్దీప్ సింగ్ పూరి, అరుణ్ సింగ్, బన్వారీ లాల్ వర్మ, బ్రిజ్ లాల్, నీరజ్ శేఖర్, సీమా ద్వివేది, గీతా శక్య లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బిఎస్‌పి నేత రామ్‌జీ గౌతమ్‌ల పదవీకాలం ఈ నవంబర్‌తో ముగియనుంది.
మరోవైపు, ఉత్తరాఖండ్ నుండి బీజేపీ ఎంపీ నరేష్ బన్సల్ కూడా నవంబర్‌లో రిటైర్ కానున్నారు.వీటితో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కోయెల్ మల్లిక్ (రుక్మిణి మల్లిక్) జూలై 16, 2026న రాజీనామా చేయడంతో ఈ సీటు ఖాళీ అయింది. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీని వీడిన నలుగురు ఎంపీలలో కోయెల్ మల్లిక్ ఒకరు. అసెంబ్లీలో రిత్బ్రత బెనర్జీ నేతృత్వంలో ప్రారంభమైన తిరుగుబాటు పార్లమెంటు సభలకూ వ్యాపించి, పలువురు టిఎంసి నేతలు పార్టీని వీడి ఎన్డీయేకు మద్దతు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ సంఖ్యాబలం ఆధారంగా విజయ అవకాశాలను చూస్తే, ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాల్లో అధికార బీజేపీ 8 స్థానాలను సునాయాసంగా దక్కించుకోనుండగా, సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క సభ్యుడు కూడా లేని బహుజన్ సమాజ్ పార్టీ తనకున్న ఏకైక రాజ్యసభ స్థానాన్ని కోల్పోనుంది.
Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!
దీంతో 1989 తర్వాత పార్లమెంటు ఉభయ సభలు, యుపి అసెంబ్లీ మరియు మండలి అనే నాలుగు చట్టసభల్లోనూ బిఎస్‌పికి ఒక్క ప్రతినిధి కూడా లేకపోవడం ఇదే తొలిసారి కానుంది. అలాగే ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలలో స్పష్టమైన మెజారిటీ మరియు పెరిగిన బలంతో ఆ రెండు రాజ్యసభ స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

