న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంతకుముందు ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లలో పేలవ ఫామ్ కారణంగా జింబాబ్వే పర్యటనకు దూరమైన ఈ వికెట్ కీపర్-బ్యాటర్‌పై అఫ్గాన్ సిరీస్ కోసం సెలెక్టర్లు మళ్లీ నమ్మకం ఉంచారు. మొదటి టీ20లో విఫలం కావడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వైభవ్ సూర్యవంశీని తిరిగి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, రెండో గేమ్‌లో చెలరేగిన శాంసన్ 22 బంతుల్లో 57 పరుగులు సాధించడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం టాప్ ఆర్డర్లో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలతో ఉన్న పోటీ గురించి శాంసన్‌ను ప్రశ్నించగా.. ఈ సవాలు చాలా కష్టమైనదని, అయితే ప్రతిఒక్కరూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, జట్టును గెలిపించడమే అందరి ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టాప్ ఆర్డర్లో ప్రతిఒక్కరూ రాణిస్తున్నారని, తన పరిధిలో ఉన్న విషయాలపైనే తాను దృష్టి సారిస్తున్నానని తెలిపారు.
సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్‌లతో సహా జట్టు యాజమాన్యానికి ఇది చాలా కష్టమైన పరిస్థితులలో కూడుకున్న నిర్ణయం. జట్టులోని వారంతా అద్భుతంగా రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకోవడానికి ప్రతిఒక్కరికీ సరైన అవకాశాలు ఇవ్వాలి. అందుకే ఇది చాలా కఠినమైన నిర్ణయం అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శాంసన్ వ్యాఖ్యానించారు.
నేను స్వయంగా ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నాను కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. గత కొన్నేళ్లుగా నేను ఇలాంటి వాతావరణంలోనే ఉన్నాను. అందుకే దీనిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నాకు తెలుసు. మన చేతిలో ఉన్న విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తూ, పోటీదారులతో కూడా సానుకూలంగా ఉండాలి. బయటి ప్రపంచానికి వారు మన పోటీదారులుగా కనిపించవచ్చు, కానీ మేమంతా ఒకే జట్టు, దేశం కోసం ఆడుతున్నాం. జట్టు విజయం తర్వాతే వ్యక్తిగత విషయాలు వస్తాయి అని తెలిపారు.
ఇంగ్లాండ్ పర్యటనలో తనను పక్కనబెట్టి సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడం, ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌లో కూడా అతనే కొనసాగడంపై శాంసన్ మాట్లాడారు. 31 ఏళ్ల శాంసన్ స్పందిస్తూ.. ఐపీఎల్లో 700కి పైగా పరుగులు చేసి సూర్యవంశీ తన సత్తా చాటాడని, తాను కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైన వేళ ఫామ్‌లో ఉన్న ఆ యువకుడికి అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమేనని అన్నారు.
ఇలాంటి సమయంలో స్పష్టమైన సంభాషణ (కమ్యూనికేషన్) చాలా ముఖ్యం. గౌతీ (గౌతమ్ గంభీర్) భాయ్ నాతో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇంగ్లాండ్ సిరీస్ సమయంలోనే కాకుండా ఈ సిరీస్ ముందు కూడా ఆయన వచ్చి నాతో వివరంగా మాట్లాడారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. జనాదరణ పొందే నిర్ణయాలు తీసుకోవడం చాలా తేలిక, కానీ మా లీడర్షిప్ గ్రూప్ ఎప్పుడూ జట్టు ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకు మా టీమ్ లీడర్షిప్ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి అని శాంసన్ తెలిపారు.
Also Read:కాంగ్రెస్ పథకాలు..ట్రంప్ కాపీ!

