హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై జరిగిన దాడి ఉదంతంపై బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీసీపీ శిల్పవల్లి మరియు పోలీస్ యంత్రాంగం వైఖరిని గట్టిగా ప్రశ్నించారు.
ఎవరైనా మాస్కులు ధరించి డీజే పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు వస్తారా డీసీపీ శిల్పవల్లి గారూ? సాధారణంగా డీజే అనుమతి కోసం ఒక్కరో లేక ఇద్దరో వస్తారు కానీ, 30 మంది గుంపుగా మాస్కులు వేసుకొని రారు” అని ఆయన ఎద్దేవా చేశారు.సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో అంతమంది పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ, మాస్కులు ధరించి దాడి చేయడానికి వచ్చిన మూకలను ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం వెనుక అర్థమేమిటని ప్రశ్నించారు.
దాడికి దిగిన వారిలో కనీసం ఒక్కరినైనా పట్టుకుని, “మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు?” అని పోలీసులు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.దాడికి యత్నించిన వారు స్థానికులని పోలీసులు ఎలా చెప్తున్నారు? దానికి ఉన్న ఆధారాలు ఏమిటి? అని ప్రశ్నించిన ఆయన, ఒకవేళ నిజంగానే వారు స్థానికులైతే వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
Also Read:చీమ లాగే వినాయకుడి రథం..
పోలీస్ స్టేషన్ లోపలే ప్రజాప్రతినిధుల సిబ్బందికి రక్షణ లేకపోవడం తెలంగాణలో క్షీణించిన శాంతిభద్రతలకు అద్దం పడుతోందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని డీసీపీ శిల్పవల్లిని మరియు ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.

