తమిళ సినీ రంగంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన ‘బిగ్ బాస్’ తమిళ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి ఇటీవలి ఎపిసోడ్లో నాయకత్వ లక్షణాలపై చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలకారణంగా మారాయి.
బిగ్ బాస్ షోలో కెప్టెన్సీ మరియు నాయకత్వం గురించి ఒక పోటీదారుతో మాట్లాడుతున్న సమయంలో విజయ్ సేతుపతి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు అడ్డగోలుగా, అసాధ్యమైన హామీలు ఇవ్వడం.. తీరా సమయం వచ్చినప్పుడు లేదా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించకుండా పారిపోయేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం ఏమాత్రం సరైన నాయకుడి లక్షణం కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన నాయకుడు బాధ్యతల నుంచి పారిపోకుండా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన హితవు పలికారు.
ఈ వ్యాఖ్యలు ప్రసారమైన వెంటనే తమిళ రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున రచ్చ ప్రారంభమైంది. ఇటీవల ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, దళపతి విజయ్ను ఉద్దేశించే విజయ్ సేతుపతి ఈ విమర్శలు చేశారని టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సేతుపతి వ్యాఖ్యలు పరోక్షంగా విజయ్ రాజకీయ ప్రవే శాన్ని, ఆయన విధానాలను లక్ష్యంగా చేసుకున్నవేనని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
వివాదం మరింత తీవ్రరూపం దాల్చడంతో షోను ప్రసారం చేస్తున్న ‘విజయ్ టెలివిజన్’ యజమాన్యం రంగంలోకి దిగి వివరణ ఇచ్చింది. విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు కేవలం బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్ కెప్టెన్సీ, హౌస్ మేట్స్ ప్రవర్తన మరియు గేమ్‌ప్లాన్‌ను ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని, ఏ రాజకీయ నాయకుడిని లేదా పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదని ఛానెల్ యాజమాన్యం వెల్లడించింది.
Also Read;లాల్బాగ్చా..భక్తుల జనసందోహం

