హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆసక్తికర, నవ్వులు పూయించే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టే క్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ వేదికపై బీఆర్ఎస్ నేతలు…కాంగ్రెస్ నాయకుల పాత్రలను అభినయిస్తూ సెటైర్లు వేశారు.
ఈ మాక్ అసెంబ్లీలో జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు స్పీకర్గా వ్యవహరించగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. అలాగే గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు వివిధ శాఖల మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన ప్రశ్నలకు సీఎం హోదాలో సమాధానమిస్తూ— మేం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం కానీ అది ఏ 100 రోజులో చెప్పామా? అంటూ సమాధానమివ్వడంతో సభలో నవ్వులు విరిశాయి.
అలాగే “ఢిల్లీ పెద్దలతో మాకున్న ఇబ్బందులు, తిప్పలు మాకు ఉన్నాయి” అని ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో కాంగ్రెస్ హైకమాండ్ సంస్కృతిని ఎద్దేవా చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో సీఎం పాత్రధారి తలసాని మాట్లాడుతూ— కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అప్పట్లో మా ఇందిరాగాంధీనే కట్టారు అని వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల శ్రేయస్సును తమ ఖాతాలో వేసుకునే తీరును విమర్శించే క్రమంలో తలసాని చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ఆసక్తికరంగా మారాయి.శాసనసభ నిబంధనలు, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారమే ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా తమ గొంతు నొక్కుతున్నారనే నిరసనతోనే బీఆర్ఎస్ వర్గాలు ప్రజల సమక్షంలో ఈ రకమైన వ్యంగ్య నిరసన సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read:ప్రోటీన్ పౌడర్లో పురుగులు..నటి ఫిర్యాదు!

