పూణేలోని ముంధ్వా భూ ఒప్పందం వ్యవహారంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుమారుడు, ఎన్‌సిపి నేత పార్థ్ పవార్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో పార్థ్ పవార్ అత్యంత “ప్రభావితం చేయగల వ్యక్తి” అని వ్యాఖ్యానిస్తూ ఈ కేసుపై నిష్పాక్షిక విచారణ జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
పూణేలోని ముంధ్వా ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ/గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు, బిల్డర్లకు ప్రయోజనం చేకూరేలా భూమి కొనుగోలు ఒప్పందాలు (Land deal) కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఒప్పందాలలో డిప్యూటీ సీఎం కుమారుడు పార్థ్ పవార్ పాత్రపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పార్థ్ పవార్ ఒక అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి కుమారుడని, సమాజంలో అత్యంత రాజకీయ ప్రాభవం ఉన్న వ్యక్తి కావడంతో ఈ కేసు విచారణను స్థానిక అధికారులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందనే ఆందోళనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
Also Read:రణ్‌వీర్-దీపికా..స్పెషల్ షూట్
అధికారంలో ఉన్న ప్రముఖుల పేర్లు ఈ ల్యాండ్ స్కామ్‌లో ముడిపడి ఉన్నందున, ఏ రకమైన రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఆదేశించింది. ఈ భూమి కేటాయింపులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులతో పాటు లబ్ధిదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

