బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న పోరాటానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. నవంబర్ 27వ తేదీని “బాల్య, చిన్న వయస్సు మరియు బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ రోజు”గా (International Day for the Elimination of Child, Early and Forced Marriage) ఐక్యరాజ్యసమితి (UN) అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రత్యేకమైన రోజును కేటాయించాలని ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ వ్యవస్థాపకుడు భువన్ రిభు ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదన చేశారు. సెప్టెంబర్ 4న సియెర్రా లియోన్ దేశం ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టగా, దానికి ఆమోదం లభించింది. భారతదేశంలో 2024 నవంబర్ 27న కేంద్ర ప్రభుత్వం ‘బాల వివాహ ముక్త భారత్’ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినందున ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ తీర్మానం ఆమోదం పొందిన సమయంలో ఐక్యరాజ్యసమితికి ఆహ్వానించబడిన ఏకైక పౌర సమాజ ప్రతినిధి అయిన భువన్ రిభు మాట్లాడుతూ… “బాలల పరిరక్షణలో భారతదేశం నేడు విశ్వగురువుగా నిలిచింది. పిల్లలు, స్థానిక సమాజాల నుండి ప్రారంభమై, అనంతరం ప్రభుత్వం భాగస్వామ్యంతో 2024 నవంబర్ 27న 25 కోట్లకు పైగా ప్రజలు ప్రతిజ్ఞ పూనిన ఈ ప్రచారం, నేడు ప్రపంచం గుర్తించిన అంతర్జాతీయ దినోత్సవంగా మారడం ప్రతి భారతీయుడికి గర్వకారణం” అని సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలను శాశ్వతంగా అంతం చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాల శాతం గణనీయంగా తగ్గుతోంది. 2019-21 (NFHS-5)లో 18 ఏళ్ల కంటే ముందే పెళ్లిళ్లయిన మహిళల శాతం 23.3% ఉండగా, 2023-24 (NFHS-6) నాటికి అది 20.1%కి తగ్గింది. 2026 నాటికి ఈ శాతాన్ని మరింత తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:భారీ వర్షాలు..ఢిల్లీకి ఎల్లో అలెర్ట్!
ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం (SDG Goal 5.3)లో భాగంగా 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలనే ప్రపంచ లక్ష్యానికి ఈ నిర్ణయం కొత్త ఊపిరి పోసింది. గత రెండేళ్లుగా ఈ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలుగెత్తి చూపడంలో భాగస్వామిగా ఉన్నందుకు ఎన్డీటీవీ ప్రతినిధులు సైతం ఆనందం వ్యక్తం చేశారు.

