విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా (శరన్నవరాత్రి) ఉత్సవాల షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దుర్గమ్మ అలంకారాల వివరాలు:
అక్టోబర్ 11: శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అలంకారం (ఉత్సవాల ప్రారంభం)
అక్టోబర్ 12: శ్రీ గాయత్రీదేవి అలంకారం
అక్టోబర్ 13: శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
అక్టోబర్ 14: శ్రీ మహాచండీదేవి అలంకారం
అక్టోబర్ 15: శ్రీ లలితా త్రిపురసుందరీదేవి అలంకారం
అక్టోబర్ 16: శ్రీ సరస్వతిదేవి అలంకారం (మూలానక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు)
అక్టోబర్ 17: శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం
అక్టోబర్ 18: శ్రీ దుర్గాదేవి అలంకారం
అక్టోబర్ 19: శ్రీ మహిషాసురమర్థిని అలంకారం
అక్టోబర్ 20: శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకారం
అక్టోబర్ 20న కృష్ణా నదిలో తెప్పోత్సవం
దసరా ఉత్సవాల చివరి రోజైన అక్టోబర్ 20వ తేదీ విజయదశమి పర్వదినాన అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దివ్యదర్శనం ఇవ్వనున్నారు. అదే రోజు సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై వేంచేపు చేసి కమనీయంగా ‘తెప్పోత్సవం’ నిర్వహించనున్నారు.
Also Read:కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం
ఈ తొమ్మిది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, ప్రసాద విక్రయ శాలలు మరియు భద్రతా ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేస్తున్నారు.

