యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసు

1
- Advertisement -

న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను అమలు చేయడంలో కొందరు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గానూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) సొసైటీ నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దుర్గం రవీందర్ అనే వ్యక్తి గతంలో తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ చేపట్టిన హైకోర్టు, సదరు అంశంపై తగిన విచారణ జరిపి మూడు నెలల వ్యవధిలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గతేడాది అక్టోబర్ మాసంలో విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు ఆదేశించి ఏడాది గడుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ తీసుకోకపోవడంతో పిటిషనర్ దుర్గం రవీందర్ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయడంలో అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ (Contempt Petition) దాఖలు చేశారు.

Also Read:మంత్రి పదవికి కొండా రాజీనామా?

ఈ ధిక్కరణ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం విద్యాశాఖ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

- Advertisement -