భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను బహూకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇస్రో తలపెట్టిన రాబోయే అంతరిక్ష ప్రయోగానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండవ లాంచ్ పాడ్ నుండి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున ఈ ఉపగ్రహ ప్రయోగం జరగనుంది.
ఈ ప్రయోగంలో GSLV-F17 ప్రయోగ నౌక ద్వారా EOS-05 (Earth Observation Satellite-05) అనే అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు.జియో-స్టేషనరీ (భూ స్థిర) కక్ష్యలో ప్రయోగిస్తున్న భారతదేశపు తొలి అత్యాధునిక ఇమేజింగ్ శాటిలైట్ ఈ EOS-05 అని ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
ఈ ఉపగ్రహం ద్వారా దేశ సరిహద్దులపై నిరంతర నిఘాతో పాటు, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం మరియు పర్యావరణ మార్పులకు సంబంధించిన కీలక డేటాను ఎప్పటికప్పుడు పొందవచ్చని ఆయన వివరించారు.
Also Read:IRGC:రెండోరోజు వైమానిక దాడులు

