నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అహంకార, నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కమలదళంలో అసమ్మతి అగ్గి రాజేసింది. ఎంపీ అరవింద్ ఏకపక్ష వైఖరి, పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తున్న తీరుపై స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఎంపీ అరవింద్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా సుమారు 174 మంది స్థానిక నాయకులు, కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు ఈ సమావేశంలో పాల్గొని ‘వాట్ నెక్స్ట్’ (తదుపరి కార్యాచరణ ఏమిటి?) అనే అంశంపై తీవ్రంగా చర్చించారు.
ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన బోగ శ్రావణికి ధర్మపురి అరవింద్ తన తండ్రి (మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్) వాడిన కారును కానుకగా ఇవ్వడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాత్రింబవళ్లు పార్టీ కోసం, ఎన్నికల్లో అరవింద్ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన తమకు కనీసం ఒక బైక్ అయినా ఇచ్చారా అని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:నేపాల్ వరదలు..అప్‌డేట్
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని విస్మరించి, బోగ శ్రావణిని ఎంపీ కావాలనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారని నేతలు ఆరోపించారు. టికెట్ కేటాయింపుల్లో మోసం!గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ వేరే వ్యక్తికి ఇస్తానని నమ్మబలికి, చివరి నిమిషంలో తానే నిలబడి తమను మోసం చేశారని సీనియర్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ విషయంపై ఢిల్లీ స్థాయి నాయకత్వాన్ని కలసి ఎంపీ తీరును ఎండగట్టాలని, తమకు న్యాయం జరగకపోతే తదుపరి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని అసమ్మతి నేతలు హెచ్చరించారు.

