వరదలతో అల్లకల్లోలమైన నేపాల్‌లో సహాయక మరియు గాలింపు చర్యలు వేగంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా 320 మంది భారతీయ పౌరులతో పాటు సుమారు 100 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు సాధ్యపడలేదని (మిస్సయ్యారని) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం వెల్లడించింది. కాకపోతే గల్లంతైన వారి జాబితాలను నిరంతరం సవరిస్తుండటంతో ఈ సంఖ్యల్లో మార్పులు ఉండవచ్చని తెలిపింది. బాధితులతో కమ్యూనికేషన్ పునరుద్ధరించడానికి మరియు వారిని సురక్షితంగా తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్ఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
పరిస్థితిని వివరిస్తూ, వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఖాట్మండు చేరుకున్న 21 మంది భారతీయ పౌరులు శుక్రవారం సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని జైస్వాల్ తెలిపారు. నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాత్సవ ఖాట్మండులో ఈ బృందాన్ని కలిసి వారి ఆరోగ్య సంక్షేమాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
“నేపాల్ విపత్తు వేళ భారత్ మానవతా దృక్పథంతో అందిస్తున్న సహాయం గురించి మీకు తెలిసిందే. మరిన్ని సహాయక సామగ్రి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రి వెళ్లింది, మూడో విడత శుక్రవారం సాయంత్రం బయలుదేరనుంది” అని ఆయన పేర్కొన్నారు.
నేపాల్ ప్రభుత్వం కోరిన విధంగా ఒక ‘టన్నెల్ రెస్క్యూ టీమ్’ (సొరంగ మార్గాల్లో రక్షించే బృందం) ను పంపడానికి భారత్ సన్నాహాలు చేస్తోందని జైస్వాల్ వెల్లడించారు. పరికరాల అవసరాన్ని అంచనా వేసేందుకు ముందుగా ఒక ప్రాథమిక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. “ఒక వైద్య బృందాన్ని కూడా పంపుతున్నాం. వీటితో పాటు రవాణా పునరుద్ధరణకు బెయిలీ వంతెనలను వాటి సాంకేతిక సిబ్బందిని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఒక బెయిలీ బ్రిడ్జ్ నేపాల్‌లో అందుబాటులో ఉంది” అని ఆయన తెలిపారు.
సురక్షితంగా బయటపడిన భారతీయులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేపాల్ ప్రభుత్వం నుండి దీనికి సంబంధించి ఆమోదం కోసం వేచి చూస్తున్నామని, నేపాల్ కోరే ఎలాంటి సహాయానికైనా భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
కాగా, వరదల్లో మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 538కి చేరిందని నేపాల్ పోలీసులు తెలిపారు. టిబెట్ సరిహద్దులో కొండచరియల వల్ల ఏర్పడిన ఒక సరస్సులో నీటిమట్టం పెరిగి మళ్లీ వరద ముప్పు పొంచి ఉండటంతో హెచ్చరికల మధ్య రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
హిమాలయ దేశంలోని ఎనిమిది జిల్లాల నుండి మృతదేహాలను వెలికితీశారు.
నవల్పరాసి ఈస్ట్‌లో 134, చిత్వాన్‌లో 221, గోర్ఖాలో 46, నువాకోట్‌లో 37 మృతదేహాలు లభ్యమయ్యాయి.
అలాగే ధాడింగ్‌లో 33, తనహున్లో 28, నవల్పరాసి వెస్ట్‌లో 27, రసువాలో 12 మృతదేహాలను వెలికితీశారు.
2,391 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 7,451 మంది భద్రతా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
Also Read:H1N1:ఢిల్లీలో పెరుగుతున్న కేసులు
ఈ వారం ప్రారంభంలో భారీ విపత్తు సంభవించిన ప్రాంతంలో నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో మరో వరద వచ్చే ప్రమాదం ఉందని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (NDRRMA) హెచ్చరించింది. బుధవారం రసువా మరియు మధ్య నేపాల్ పరిధిలో సంభవించిన ఈ పీడకల లాంటి ఫ్లాష్ ఫ్లడ్‌లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యికి పైగా ప్రజలు ఆచూకీ లేకుండా పోయారు.

