టిబెట్ సరిహద్దు వైపున ఉన్న డ్యామ్ లేదా బారికేడ్ సరస్సు మళ్లీ తెగిపోవడంతో శుక్రవారం నేపాల్ అధికారులు తాజా వరద హెచ్చరిక జారీ చేశారు. నేపాల్ పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, “టిబెట్ వైపు నీటి డ్యామ్ మళ్లీ బరస్ట్ అయిందని సమాచారం అందింది. సహాయక మరియు రెస్క్యూ చర్యలలో నిమగ్నమైన భద్రతా సిబ్బంది, రెస్క్యూ వర్కర్లు మరియు సాధారణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మరియు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరుతున్నాము” అని పేర్కొన్నారు.
నేపాల్‌లో విరుచుకుపడిన పిడుగుపాటు వరదల్లో (ఫ్లాష్ ఫ్లడ్స్) ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం ఉదయం పోలీసులు తెలిపారు. అధికారులు రెస్క్యూ, సహాయక చర్యలను మరింత ముమ్మరం చేశారు. అయితే, వందలాది మంది విదేశీయులతో సహా 1,400 మందికి పైగా ఇంకా కనిపించకుండా పోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేపాల్ అధికారుల వివరాల ప్రకారం.. బుధవారం నాటి ఘోర కలికలం తర్వాత 30 కంటే ఎక్కువ దేశాలకు చెందిన విదేశీయులు గల్లంతయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అందించిన సమాచారం ప్రకారం.. మిస్సయిన వారిలో 288 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 73 మంది ఒక విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు. గల్లంతైన వారిని గుర్తించడంలో మరియు హిమాలయ దేశానికి రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయపడటానికి న్యూఢిల్లీ, ఖాట్మండుతో సమన్వయం చేసుకుంటోంది.
నేపాల్‌లో ఈ వరదలు 469 మంది ప్రాణాలను బలిగొనగా, టిబెట్‌లో కూడా ముగ్గురు మరణించినట్లు చైనా అధికారిక మీడియా ధృవీకరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున, విపత్తు ప్రాంతం నుండి 499 మంది స్థానిక నివాసితులను, 555 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది.
బుధవారం నాటి కొండచరియలు విరిగిపడటంతో ఏర్పడిన ఒక సరస్సు నుండి తీవ్ర వరద ముప్పు ఉందని అధికారులు హెచ్చరించినట్లు చైనా రాష్ట్ర మీడియా పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేయబడింది. దీనివల్ల సరస్సు గట్టు తెగి, “దిగువకు వరద నీరు వచ్చి పడే ప్రమాదం ఎక్కువగా ఉందని” అధికారులు హెచ్చరించారు.
Also Read:రేవంత్‌కు రాఖి కట్టిన కొండా
“రాబోయే మూడు రోజుల్లో నిరంతర వర్షాల వల్ల సరస్సులోకి సుమారు 30 లక్షల క్యూబిక్ మీటర్ల ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సరస్సు గట్టు తెగే ప్రమాదాన్ని పెంచుతుంది. దీనివల్ల దిగువ ప్రాంతాలకు, ముఖ్యంగా గైరోంగ్ పోర్ట్ మరియు ఇతర ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది” అని స్టేట్ న్యూస్ ఏజెన్సీ షిన్హువా గురువారం నివేదించింది.

