ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వంటింటి ఖర్చులతో బతుకుబండిని ఈదడం సగటు గృహిణికి సవాలుగా మారింది. బియ్యం, నూనె, చక్కెర నుండి కూరగాయల వరకు ప్రతీ ఒక్క దాని ధర మంట పుట్టిస్తుండటంతో సామాన్యుడి జేబుకు భారీ చిల్లు పడుతోంది.
నిత్యం కూరల్లో వాడే ఉల్లిపాయ ధర ప్రస్తుతం చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ. 60 నుండి రూ. 70 వరకు పలుకుతుండటంతో వినియోగదారులు ఉల్లిని తాకాలంటేనే భయపడిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గడం, దిగుబడులు లేకపోవడంతో మార్కెట్లో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడి ధరలు నింగినంటాయి.
కేవలం ఉల్లి మాత్రమే కాదు, వంటింట్లో వాడే ఏ వస్తువు కొందామన్నా ధరలు భయపెడుతున్నాయి. ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయాయి. నాణ్యమైన బియ్యం కిలో రూ. 55 దాటి రూ. 65 వరకు విక్రయిస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలపై నెలకు వేలల్లో అదనపు భారం పడుతోంది.
సన్‌ఫ్లవర్ మరియు ఇతర వంటనూనెల ధరలు లీటరుకు రూ. 180 నుండి రూ. 195 వరకు ఎగబాకాయి. చక్కెర, బెల్లం, పాల ధరలు కూడా పెరగడంతో నిత్యం చేసుకునే టీ, టిఫిన్ల ఖర్చులు కూడా రెట్టింపయ్యాయి.ధరలు ఇష్టారీతిన పెరుగుతున్నా మార్కెట్లలో ధరల నియంత్రణపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
Also Read:రేవంత్‌కు రాఖి కట్టిన కొండా
రైతు బజార్లు, నిత్యావసర సరుకుల డిపోల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, ఉల్లిపాయలు, వంటనూనెలను అందుబాటులోకి తెచ్చి తమను ఆదుకోవాలని సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

