ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలను వేధిస్తున్న ప్రధాన సమస్య తగ్గుతున్న జననాలు (Fertility Rate). ఈ సమస్య పరిష్కారానికి సింగపూర్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో జననాల రేటును పెంచేందుకు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారీ ‘ఫ్యామిలీ సపోర్ట్ ప్యాకేజీ’ని ప్రకటించారు.
ఈ కొత్త పథకం కింద దేశంలో పుట్టే ప్రతి బిడ్డకు 17 ఏళ్లు నిండే వరకు వివిధ రూపాల్లో కలిపి దాదాపు 70,000 సింగపూర్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 55 లక్షలు) ఆర్థిక సహాయంగా లభించనుంది. పిల్లలు పుట్టిన వెంటనే నగదు రూపంలో ఇచ్చే బోనస్‌లతో పాటు, వారి విద్యాభ్యాసం, వైద్య ఖర్చులు మరియు భవిష్యత్తు పొదుపు ఖాతాల ద్వారా ఈ 17 ఏళ్ల కాలంలో రూ. 55 లక్షల విలువైన సహాయం అందుతుంది.
సింగపూర్‌లో చారిత్రాత్మకంగా జననాల రేటు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో భవిష్యత్తులో తీవ్ర శ్రామిక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లల పెంపకం, చదువు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ ప్యాకేజీ దంపతులకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
Also Read:జలప్రళయం..ఆ రాష్ట్రాలకు అలర్ట్!
ఆర్థిక సాయంతో పాటు తల్లిదండ్రులకు ఇచ్చే వేతనంతో కూడిన పితృత్వ/మాతృత్వ సెలవులను (Paid Parental Leaves) కూడా ప్రభుత్వం పెంచింది.కనిష్ట జననాల రేటును అధిగమించి, యువ జనాభాను ప్రోత్సహించేందుకు సింగపూర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

