నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఊహించని రీతిలో వచ్చిపడిన జలప్రళయం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది. ఈ భయంకర విధ్వంసానికి GLOF (Glacial Lake Outburst Flood) కారణమని నిపుణులు ధృవీకరించారు. మంచు పర్వతాల పైన ఉన్న గ్లేసియర్ (హిమానీనదం) విరిగిపడటంతో చైనా సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న హెలికాప్టర్లు అక్కడి పరిస్థితులను సమీక్షించాయి. హిమానీనదం పరివాహక ప్రాంతం నుంచి ఒక్కసారిగా టన్నుల కొద్దీ నీరు విడుదల కావడంతో నేపాల్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తి తీవ్ర వినాశనం సంభవించింది.
పర్వత ప్రాంతాలలో మంచు కరిగి ఏర్పడే సరస్సులకు హిమానీనదాలు, రాళ్లు, మంచుదిబ్బలు అడ్డుగా గోడలా నిలుస్తాయి. అయితే భూకంపం, భారీ హిమపాతం లేదా ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి కారణాల వల్ల ఈ సహజ సిద్ధమైన అడ్డుకట్టలు ఒక్కసారిగా విరిగిపోతాయి. దీనినే ‘గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్’ (GLOF) అంటారు.
కట్ట తెగిపోవడంతో ప్రచండమైన వేగంతో అపారమైన నీరు మాత్రమే కాక, దానితో పాటు పెద్ద పెద్ద రాళ్లు, మంచు ఖండాలు మరియు దట్టమైన బురద దిగువ ప్రాంతాలకు ఉప్పెనలా దూసుకొస్తాయి.హెచ్చరికలు జారీ చేసే సమయం కూడా లేకపోవడంతో మార్గమధ్యంలో ఉన్న గ్రామాలు, రోడ్లు, బ్రిడ్జిలు మరియు జలవిద్యుత్ ప్రాజెక్టులు క్షణాల్లో తుడిచిపెట్టుకుపోతాయి.
Also Read:జలప్రళయం..ఆ రాష్ట్రాలకు అలర్ట్!
హిమాలయ కారిడార్‌లో ప్రకృతి ప్రకోపిస్తే మానవాళికి ఎంతటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుందో ఈ ఘటన మరోసారి ప్రపంచానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, వాతావరణ మార్పుల ధాటికి హిమానీనదాలు కరిగిపోవడం వంటి అంశాలపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ GLOF విధ్వంసం చాటిచెబుతోంది.

