నేపాల్‌లో ప్రళయం..మృతదేహాలతో!

4
- Advertisement -

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భూకంపం, దానికి తోడు వచ్చిన భారీ హిమపాతం వల్ల నేపాల్ దేశంలో వర్ణనాతీతమైన భయంకర జలప్రళయం సంభవించింది. భూకంప ధాటికి పర్వతాల పైభాగంలో ఉన్న మంచు, కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో భోటే కోషి, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చాయి. భారీ ఎత్తున విరుచుకుపడిన బురద ప్రవాహంలో పదికి పైగా జిల్లాలు, వందలాది గ్రామాలు కొట్టుకుపోయి ఎటు చూసినా నామరూపాలు లేకుండా పోయాయి. ఊహించని ఈ విపత్తుతో వేలాది మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి వీధిన పడ్డారు.

ఈ విలయతాండవంలో దాదాపు 13 జల విద్యుత్తు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రసువాగఢి సహా పలు ప్రధాన విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతినడంతో దేశంలో సమాచార వ్యవస్థ, విద్యుత్ సరఫరా తీవ్రంగా నిలిచిపోయాయి. వరద తగ్గిన చోట ఎటు చూసినా దట్టమైన బురద, శిథిలాలే కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన వందలాది మంది దయనీయ పరిస్థితులను అనుభవిస్తున్నారు. బురదలో పేరుకుపోయిన పదునైన రాళ్లు, గాజు పెంకులు, ఇనుప తీగల కారణంగా అడుగు తీసి అడుగు వేస్తేనే మనుషుల కాళ్లు, శరీర భాగాలు తెగిపోతూ రక్తసిక్తమవుతున్నాయి.

ఘటనా స్థలంలో ఎక్కడికక్కడ మృతదేహాలు కొట్టుకొస్తూ కనిపిస్తుండటం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వందలాది మంది ప్రజలు ఇంకా బురద శిథిలాల కింద కూరుకుపోగా, మరికొందరు గల్లంతయ్యారు. కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు కూడా ఈ వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం నేపాల్ సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశాయి. భారత ప్రభుత్వం కూడా అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటిస్తూ తక్షణ సహాయక సామగ్రిని నేపాల్‌కి పంపించింది.

Also Read:బీజేపీపై విరుచుకుపడ్డ అఖిలేష్

- Advertisement -