ఎమ్మెల్యే కౌశిక్‌కు ఎథిక్స్ కమిటీ నోటీసులు

2
- Advertisement -

హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ శాసనసభ నైతికతల (ఎథిక్స్) కమిటీ నోటీసులు జారీ చేసింది. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన కడియం శ్రీహరిని ఉద్దేశించి అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఎథిక్స్ కమిటీ ఆగస్ట్ 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌–1లో సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనుచిత వైఖరిపై అధికార పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ విచారణకు పంపించారు.

ఆగస్ట్ 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌–1లో కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి వివరణ కోరిన అనంతరం, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై స్పీకర్‌కు ఎథిక్స్ కమిటీ తన నివేదికను, సిఫార్సులను సమర్పించే అవకాశం ఉంది. ఎథిక్స్ కమిటీ నోటీసులపై పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. తాను 29న జరిగే కమిటీ భేటీకి హాజరై తన సమాధానాన్ని స్పష్టంగా వినిపిస్తానని తెలిపారు. అయితే ఎథిక్స్ కమిటీ నిబంధనలు కేవలం ప్రతిపక్ష సభ్యులకే వర్తిస్తాయా లేదా కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు కూడా వర్తిస్తాయా అని ఆయన నిలదీశారు.

- Advertisement -