నేపాల్‌ వరదలు..గ్రామాలు ఖాళీ!

1
- Advertisement -

నేపాల్‌లోని రసువా జిల్లాలో టిబెట్ సరిహద్దు సమీపంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన వరద నీటికి పలు గ్రామాలు, మౌలిక వసతుల ప్రాజెక్టు సైట్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండవచ్చని అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

ప్రారంభ సమాచారం ప్రకారం దాదాపు 1,000 మంది వరకు వరద నీటిలో కొట్టుకుపోయి ఉండవచ్చని భయపడుతున్నారు. అయితే, సహాయక మరియు రెస్క్యూ చర్యలు ఇంకా కొనసాగుతున్నందున ఈ సంఖ్యపై అధికారులు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.రసువా జిల్లాలోని పర్వత ప్రాంతాలైన శ్యాప్రు బెసి, తిమురే ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో వరద సృష్టించిన విధ్వంసానికి గ్రామాలు, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.

బోటే కోషి నది ప్రవాహం ప్రమాదకరంగా పెరగడంతో నదీతీర ప్రాంత ప్రజలను వెంటనే ఖాళీ చేసి ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.టిబెట్ వైపున ఉద్భవించే భోటే కోషి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించిందని నేపాల్ పోలీసులు తెలిపారు. త్రిశూలి నది పరివాహక ప్రాంతాలైన నువాకోట్, ధాడింగ్, చిత్వాన్, గోర్ఖా మరియు పరిసర జిల్లాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మరియు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని యంత్రాంగం ఆదేశించింది.

ప్రభావ ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యవసర రెస్క్యూ బృందాలు ధ్వంసమైన ప్రాంతాలను చేరుకుని, ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి.అయితే దుర్గమమైన పర్వత ప్రాంతాలు మరియు దెబ్బతిన్న రోడ్డు మార్గాల వల్ల రెస్క్యూ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. నేపాల్‌లో సంభవించిన ఈ అకస్మాత్తు విపత్తుపై నేపాల్ ప్రధాని బాలెన్ షా జాతీయ విపత్తు నిర్వహణ మండలితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన సలహాదారు అసిమ్ షా మాట్లాడుతూ, ప్రధాని బాధితుల రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

- Advertisement -