ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) ఫైనల్ రేసులో వెనుకబడినప్పటికీ, భారత్‌కు ఇంకా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయని మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన 8 టెస్టుల్లో ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కనీసం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంది.
యూరోపియన్ T20 ప్రిమియర్ లీగ్‌లో డుబ్లిన్ గార్డియన్స్ సహ యజమానిగా ఉన్న ద్రవిడ్, జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ… “భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇక్కడి నుంచి ఫైనల్‌కు చేరుకుంటే అది అద్భుతమైన ప్రయాణం అవుతుంది. ప్రస్తుతం జట్టు కాస్త వెనుకబడిన మాట వాస్తవమే, కానీ భారత జట్టు వద్ద ఉన్న నైపుణ్యం, నాణ్యత దృష్ట్యా ఏ దశలోనూ వారిని తక్కువ అంచనా వేయలేము. శ్రీలంకతో సిరీస్‌ను వారు విజయంతో ప్రారంభించడం మంచి పరిణామం” అని అన్నారు.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే, అక్టోబర్‌లో న్యూజిలాండ్ వేదికగా జరగనున్న 2 టెస్టుల సిరీస్ టీమిండియాకు అతిపెద్ద పరీక్ష అని ద్రవిడ్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ భూభాగంలో వారిని ఎదుర్కొవడం ఎప్పుడూ సవాలే. భారత యువ ఆటగాళ్లలో చాలామందికి అక్కడ ఆడిన అనుభవం లేదు. కాబట్టి అది వారికి ఒక పెద్ద సవాలుగా మారనుంది అని చెప్పారు.
Also Read:తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు
ఆ తర్వాత జనవరి 2027 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. గతంలో న్యూజిలాండ్‌లో పర్యటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా వంటి అనుభవజ్ఞుల సేవలు ఈసారి లభించకపోవడం జట్టుపై ప్రభావం చూపుతుందని ద్రవిడ్ వ్యాఖ్యానించారు. రాబోయే నెలల్లో ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

