పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మౌలిక వసతుల కొరత గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కనీస రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నకొడుకును రక్షించుకోవడానికి ఒక తండ్రి 5 కిలోమీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లాల్సిన దారుణ పరిస్థితి ఎదురైంది.
కొమరాడ మండలం పరిధిలోని రెబ్బ–వనధార గ్రామంకు రోడ్డులేదు. దీంతో తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైన యశ్వంత్ అనే చిన్నారి, అతడి తండ్రి సాహసం చేశాడు. గ్రామానికి ప్రాథమిక రహదారి సదుపాయం లేకపోవడంతో ఆంబులెన్స్ లేదా ఇతర వాహనాలు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
సాహస ప్రయాణం: పసివాడి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తండ్రి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొడుకును భుజాన వేసుకొని కొండ దారులు, వాగులు వంకలు దాటుకుంటూ 5 కిలోమీటర్లు నడిచారు. ఆ తర్వాత కూనేరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
ఏళ్లు గడుస్తున్నా తమ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితి వస్తోందని, ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మరియు అధికారులు స్పందించి తమ గ్రామానికి తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.
Also Read:తృణమూల్ రెబెల్ ఎంపీలకు నోటీసులు

