1,090 సైబర్ నేరాలు..రూ.1,071 కోట్ల లూటీ!

2
- Advertisement -

దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,071.5 కోట్ల మేర సైబర్ మోసాలకు పాల్పడి చైనాకు చెందిన నేరగాళ్లతో లింకులు నడుపుతున్న ఒక అంతర్జాతీయ సైబర్ ముఠా మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని బార్పేటలో రహస్యంగా నిఘా ఉంచి 25 ఏళ్ల రఫికుల్ ఆలమ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CCE) అధికారులు వెల్లడించారు.

నిందితుడు రఫికుల్ ఆలమ్ దేశవ్యాప్తంగా నమోదు అయిన దాదాపు 1,090 సైబర్ నేరాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇందులో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న “డిజిటల్ అరెస్ట్” మోసాలు కూడా ఉన్నాయి. బాధితుల నుంచి కొల్లగొట్టిన రూ. 1,071.5 కోట్లలోని మనీ లాండరింగ్ సొమ్మును ఏజెన్సీల కంటికి చిక్కకుండా ఉండేందుకు గంట వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఉన్న 1,750 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్న చిన్న మొత్తాలుగా విభజించి మళ్లించేవాడు.

బ్యాంకుల్లో జమ అయిన సొమ్మును నిందితుడు క్రిప్టోకరెన్సీగా మార్చి చైనాకు పంపేవాడు. అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అందులో దాదాపు ₹16 కోట్ల విలువైన లావాదేవీలు జరిగిన 23 క్రిప్టో వాలెట్లను గుర్తించారు. చైనాలోని ప్రధాన సైబర్ నేరస్థులతో రఫికుల్ వాట్సాప్, టెలిగ్రామ్ వేదికలుగా సంప్రదింపులు జరిపేవాడు. కస్టమర్ల యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు, స్కానర్లు, క్రిప్టో వాలెట్ వివరాలు, క్రైమ్ పద్ధతులు నేరుగా వారితో పంచుకునేవాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక

సాంకేతిక ఆధారాలు, బాధితుల కథనాల ఆధారంగా గుజరాత్ సిఐడి అధికారులు అస్సాం బార్పేటకు చేరుకుని, వ్యాపారుల వేషంలో మూడ్రోజుల పాటు నిందితుడి ఇంటి వద్ద నిఘా ఉంచి అతడిని సాంకేతిక ఉపకరణాలతో సహా అరెస్ట్ చేశారు.ఈ అరెస్ట్‌తో చైనా కేంద్రంగా భారత్‌లో సాగుతున్న భారీ అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్, మనీ లాండరింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయినట్లైంది.

- Advertisement -