అమెరికా ఎన్నికల్లో ఓటర్ ఐడీ, పౌరసత్వ ధ్రువీకరణను తప్పనిసరి చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన డిమాండ్‌ను బలంగా వినిపించారు. ఈ సందర్భంగా భారత్ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు. అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని భారత ఎన్నికల ప్రధాన అధికారి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు ట్రంప్ తెలిపారు.
భారత్‌లో జరిగిన గత ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్ పేర్కొన్నారు. వారిలో మెయిల్ ద్వారా ఓటు వేసిన వారి సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉందని, ప్రతి ఓటరూ చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రాన్ని చూపించాల్సి వచ్చిందని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
అమెరికాలో కూడా ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల గుర్తింపు, అర్హతలకు సంబంధించి మరింత కఠినమైన నిబంధనలు ఉండాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో SAVE America Actను ఆమోదించాలని ట్రంప్ మరోసారి కాంగ్రెస్‌ను కోరారు. ఈ చట్టం పూర్తి పేరు Safeguard American Voter Eligibility Act. ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకునే సమయంలో అమెరికా పౌరసత్వానికి ఆధారాలు సమర్పించడం, ఓటర్ ఐడీ నిబంధనలను కఠినతరం చేయడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.
అదేవిధంగా మెయిల్ ద్వారా ఓటింగ్‌పై కూడా పరిమితులు విధించే ప్రతిపాదనలు చట్టంలో ఉన్నాయి. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధులు లేదా ప్రయాణం వంటి కొన్ని పరిస్థితులకు మినహాయింపులు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎన్నికల ప్రక్రియలో మోసాలను అరికట్టడానికి ఓటర్ల గుర్తింపు, పౌరసత్వ ధ్రువీకరణ మరింత పటిష్టంగా ఉండాలని ట్రంప్ చెబుతున్నారు. ఇతర దేశాల ఎన్నికల విధానాలతో పోల్చుతూ అమెరికాలోనూ కఠినమైన నిబంధనలు అవసరమని ఆయన వాదిస్తున్నారు.
Also Read:ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!
అయితే ట్రంప్ ప్రతిపాదనలపై అమెరికాలో రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీ నేతలు.. పౌరసత్వం లేని వ్యక్తులు అక్రమంగా ఓటు వేయడం ఇప్పటికే అరుదైన విషయమని, కఠినమైన గుర్తింపు పత్రాల నిబంధనలు అర్హత ఉన్న కొంతమంది ఓటర్లకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని విమర్శిస్తున్నారు.

