వనపర్తి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. చిన్నారెడ్డిని వారం రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో గాంధీ భవన్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు.
ఇటీవల మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుగోలు చేశారంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను మేఘారెడ్డి తీవ్రంగా ఖండించారు. తాను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఎన్ని డబ్బులు చెల్లించారో చిన్నారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవిలో కొనసాగుతూ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ అధిష్ఠానంపై డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేయడం సరికాదని మేఘారెడ్డి అన్నారు. తన పదవిని కొనసాగించుకునేందుకే చిన్నారెడ్డి పార్టీపై ఒత్తిడి తెస్తూ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
చిన్నారెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు మేఘారెడ్డి వెల్లడించారు. త్వరలోనే పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.చిన్నారెడ్డిపై పార్టీ అధిష్ఠానం వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ALso Read:ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తం!
వారం రోజుల్లో చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్‌ను ముట్టడిస్తానని ఆయన హెచ్చరించారు. వనపర్తి కాంగ్రెస్‌లో ఇప్పటికే కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తాజా వ్యాఖ్యలతో మరింత ముదిరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య మాటల యుద్ధం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

