గిల్ WTC చరిత్రలోనే సరికొత్త రికార్డు!

1
- Advertisement -

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. 26 ఏళ్ల ఈ యువ బ్యాటర్ ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 8 మ్యాచుల్లోనే 950 పరుగులు చేసి, జో రూట్, హ్యారీ బ్రూక్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. శ్రీలంకతో గాలే వేదికగా ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్ ద్వారా గిల్ రెండు ప్రధాన మైలురాళ్లను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

గాలే టెస్టులో గిల్ మరో 50 పరుగులు చేస్తే ఒకే WTC సైకిల్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, రోహిత్ శర్మ ఒకే WTC సైకిల్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసినప్పటికీ, కెప్టెన్‌గా ఏ భారతీయ ఆటగాడూ ఈ ఘనత సాధించలేదు.అంతేకాకుండా WTC చరిత్రలోనే 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచేందుకు గిల్‌కు మరో 157 పరుగులు అవసరం… ప్రస్తుతం ఆయన ఖాతాలో 2,843 పరుగులు ఉన్నాయి.

WTCలో కెప్టెన్‌గా తన తొలి టెస్టు సిరీస్ విజయం కోసం గిల్ ఇంకా వేచి చూస్తున్నప్పటికీ, తన నాయకత్వంలో జట్టు సాగిస్తున్న ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన సారథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 2-2తో సమం చేసిన భారత్, ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను కోల్పోయింది (మెడ గాయం కారణంగా గిల్ ఆ సిరీస్‌లో కీలక మ్యాచులకు దూరమయ్యాడు). అనంతరం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన నాన్-WTC టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది.

Also Read:Dharman:పవర్‌ఫుల్ డాక్టర్‌గా రజనీ

కెప్టెన్సీ బాధ్యతలతో నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. గడిచిన ఏడాది కాలంలో జట్టు పురోగమించిన తీరు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. మనం సరైన దిశలోనే అడుగులు వేస్తున్నామని నమ్ముతున్నాను అని గిల్ తెలిపారు. WTC పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని ఫైనల్ చేరాలంటే రాబోయే మ్యాచుల్లో వరుస విజయాలు అవసరమని గిల్ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఏడాది జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడటమే మా ప్రధాన లక్ష్యం. మాకు ఇంకా 9 టెస్టులు ఉన్నాయి, అందులో 6 లేదా 7 మ్యాచులు గెలిస్తేనే ఫైనల్ రేసులో నిలుస్తాం. కాబట్టి శ్రీలంకతో జరిగే ఈ సిరీస్ మాకు చాలా కీలకమైనది అని తెలిపాడు.

- Advertisement -