హార్దిక్‌కు షాకిచ్చిన గుజరాత్‌ ఫ్రాంచైజీ!

1
- Advertisement -

భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ జట్టులోకి తిరిగి వెళ్లాలనే ప్రతిపాదన విఫలమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ పదవిని డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఉన్న గుజరాత్ ఫ్రాంచైజీ ఈ షరతును నిరాకరించగా తాము ఫ్రాంచైజీని నేరుగా సంప్రదించలేదని హార్దిక్ ప్రతినిధి ఈ వార్తలను ఖండించారు.

ఐపీఎల్ 2027కి ముందు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టును వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ జట్టులోకి ఆయన పునరాగమనం ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో, రెండు వైపులా విడిపోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలతో ముంబై యాజమాన్యం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

ఈ క్రమంలో హార్దిక్ తన పాత జట్టు అయిన గుజరాత్ టైటాన్స్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, శుభ్‌మన్ గిల్ ఒక నమ్మకమైన నాయకుడిగా స్థిరపడటంతో, 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. హార్దిక్ తాను వెళ్లే ఏ ఫ్రాంచైజీలోనైనా కెప్టెన్సీనే కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే ట్రేడ్ చర్చలపై గుజరాత్ ఆసక్తి చూపడం లేదు.

హార్దిక్ తిరిగి జట్టులోకి రావడానికి ఫ్రాంచైజీకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయమై వారు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కూడా చర్చించారు. ఆయనను ట్రేడ్ ద్వారా తిరిగి తీసుకోవడానికి గిల్ కూడా అంగీకరించారు. కానీ హార్దిక్ కెప్టెన్సీ షరతు విధించడంతో ప్రతి ఒక్కరూ నైస్ గా ‘నో’ చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read:మ్యారేజ్ డే..మొక్కలు నాటిన సంతోష్ దంపతులు

అయితే హార్దిక్ నేరుగా ఏ ఫ్రాంచైజీతోనూ మాట్లాడలేదని ఆయన ప్రతినిధి స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫర్ ట్రేడ్ లేదా ఇతర విషయాలపై హార్దిక్ పాండ్యా ఎలాంటి ఫ్రాంచైజీతో నేరుగా మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా సంప్రదించాలనుకుంటే అది ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ద్వారానే జరగాలి అని తెలిపారు.

- Advertisement -