ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అండగా నిలిచారు. తమ కలలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతున్న ఇద్దరు రైతు పిల్లలకు తన సొంత ఆలోచన అయిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ల్యాప్‌టాప్‌లను అందజేశారు.
జీవన్ (మిర్యాలగూడ, పెద్దతండాకు చెందిన నిరుపేద రైతు కుమారుడైన జీవన్, తీవ్ర ప్రతికూల పరిస్థితులను అధిగమించి ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్ లో బయోటెక్నాలజీ సీటు సాధించి సత్తా చాటాడు.
అలాగే ఫర్జానా (వర్ధన్నపేట, దమ్మన్నపేట)కు చెందిన రైతు కుమార్తె అయిన ఫర్జానా, దేశ అత్యున్నత సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా సివిల్స్ కోచింగ్ తీసుకుంటోంది.డిజిటల్ సాధనాలు లేక వీరు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను తెలుసుకున్న కేటీఆర్, వారి చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు వ్యక్తిగతంగా ల్యాప్‌టాప్‌లను బహుకరించారు.
Also Read:ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ నో!
ఈ సందర్భంగా విద్యార్థులిద్దరితో మాట్లాడిన కేటీఆర్ వారి ప్రతిభను కొనియాడారు. ఎంతటి కష్టమొచ్చినా చదువును ఆపవద్దని, ఇద్దరూ బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కష్టపడి పైకి వచ్చి తమ కుటుంబాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు. తమకు ల్యాప్‌టాప్‌లు అందజేసి భరోసానిచ్చిన ‘రామన్న’కు విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

