పెద్ది సంస్మరణ సభ..హరీష్ కంటతడి

2
- Advertisement -

నల్లబెల్లిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు.. పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని, ఉద్యమ కాలపు జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో ఆయన ప్రసంగిస్తూ కంటతడి పెట్టుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ హరీష్ రావు అత్యంత వేదనకు లోనయ్యారు. “మలిదశ ఉద్యమ సమయంలో వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద పోలీసులతో జరిగిన ఘర్షణలో నాకు తీవ్రంగా దెబ్బ తగిలింది. ఆ సమయంలో నన్ను భుజాలపై వేసుకుని, ప్రాణాలకు తెగించి వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లింది పెద్ది సుదర్శన్ రెడ్డి. నాడు నన్ను కాపాడేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆ ప్రియతమ సోదరుడిని.. నేడు అదే ఆసుపత్రిలో చివరి చూపు చూస్తానని కలలో కూడా ఊహించలేదు” అని చెబుతూ హరీష్ రావు గొంతు మూగబోయింది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ, ఆ తర్వాత ప్రజాసేవలోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలు ఎప్పటికీ చిరస్మరణీయమని హరీష్ రావు కొనియాడారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఎంతో అభిమానం, ప్రత్యేకమైన ప్రేమ ఉండేదని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినప్పుడు కాపాడుకోవడానికి కేసీఆర్ శతవిధాలా ప్రయత్నించారని, కానీ చివరకు ఆయన మనమధ్య లేకుండా పోవడం పార్టీకి, ప్రాంతానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:టీడీపీ ఎమ్మెల్యేకి జనసేన నేత వార్నింగ్

ఈ సంస్మరణ సభలో పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. హరీష్ రావు భావోద్వేగాన్ని చూసి సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

- Advertisement -