మలద్వారంలో బంగారం..అడ్డంగా దొరికాడు!

2
- Advertisement -

బంగారం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. తనిఖీల్లో అధికారుల కళ్లకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత ప్రమాదకరమైన, దారుణమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటువంటి వింత స్మగ్లింగ్ ఉదంతం వెలుగుచూసింది.

ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో జెడ్డా (సౌదీ అరేబియా) నుండి అహ్మదాబాద్ వచ్చిన సర్ఫరాజ్ మాలా అనే ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ప్రయాణికుడి ప్రవర్తన, కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని సమగ్రంగా తనిఖీ చేశారు.

అధికారులు చేసిన స్కానింగ్ మరియు తనిఖీల్లో నిందితుడు తన మలద్వారం (Rectum) లో బంగారాన్ని గుళికల రూపంలో దాచిపెట్టుకుని అక్రమ రవాణా చేస్తున్నట్లు బయటపడింది. అతడి శరీరం నుండి రూ. 65.69 లక్షల విలువైన 467.09 గ్రాముల పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆ బంగారాన్ని శుద్ధి చేసి కడ్డీ రూపంలోకి మార్చగా 422.83 గ్రాముల స్వచ్ఛమైన బంగారం లభ్యమైందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన అధికారులు అతడి వెనుక ఉన్న స్మగ్లింగ్ నెట్‌వర్క్ గురించిన సమాచారాన్ని రాబట్టేందుకు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Also Read:CWG విజేతలపై మోదీ ప్రశంసలు

- Advertisement -