సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన నిధుల వివాదంలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను పోలీసులు ఈరోజు ఉదయం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు బకాయి పడిన నిధుల విడుదల వ్యవహారంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద తీవ్రంగా స్పందించిన ఉన్నత న్యాయస్థానం… ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాను అరెస్ట్ చేసి, తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, ఈరోజు ఉదయం ఆయనను తీసుకువచ్చి న్యాయమూర్తి సమక్షంలో ప్రవేశపెట్టారు.విచారణ సందర్భంగా సందీప్ సుల్తానియా కోర్టుకు వివరణ ఇస్తూ…కంటోన్మెంట్ బోర్డుకు ఇప్పటికే కొన్ని నిధులను విడుదల చేశామని తెలిపారు. బకాయి ఉన్న మిగతా నిధులను కూడా పలు విడతల్లో (దశలవారీగా) పూర్తిస్థాయిలో విడుదల చేస్తామని న్యాయమూర్తికి నివేదించారు.
ఈ సందర్భంగా విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, నిర్ణయాల వల్ల చివరకు అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొని, ఈ విధంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది అని ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేసింది.
Also Read:కాంగ్రెస్కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక
న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలను బడ్జెట్ విడుదల సాకులతో వాయిదా వేయడం తగదని, ఇకపైనైనా ఇచ్చిన హామీ ప్రకారం కంటోన్మెంట్ బోర్డుకు నిధులను సకాలంలో విడుదల చేయాలని స్పష్టం చేసింది.

