రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో, జెప్టో అన్నీ బంద్ కానున్నాయి. ఈ మేరకు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి 16 వాహన సంఘాలు. రేవంత్ ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి తట్టిలేపడానికి తామంతా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించింది వాహన, డెలివరీ సంఘాల జేఏసీ.
ఆటో, క్యాబ్, లారీ, ఓలా, ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్ చేస్తామని తెలిపింది జేఏసీ. ఇప్పటివరకు చాలాసార్లు తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేయగా యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్ఫేర్తో పాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలి అని డిమాండ్ చేశారు.
తద్వారా యాప్ ఆధారిత డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, అన్ని గిగ్, ప్లాట్ఫారం కార్మికులకు స్థిరమైన ఆదాయం లభించేలా చూడాలి అని తెలిపారు సంఘాల నేతలు. తెలంగాణ గిగ్, ప్లాట్ఫారం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి, వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలి అని.. మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025ను పూర్తిగా అమలు చేసి, ప్రభుత్వం నిర్ణయించిన కనీస చార్జీలను నోటిఫై చేయాలి అని డిమాండ్ చేశారు.
మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్‌ను మార్చకుండా ప్రైవేట్ (నాన్-కమర్షియల్) ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి వాహన సంఘాలు.
Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

