2004లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో కమల, సోన్బారి, రత్నై అనే ముగ్గురు మహిళలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 22 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిని “బలహీనమైన మరియు నమ్మశక్యం కాని” ఆధారాల ఆధారంగా శిక్షించారంటూ సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రస్తావిస్తూ తీర్పునిచ్చింది.
విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి జీవితంలో 22 విలువైన సంవత్సరాలను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జస్టిస్ ఎస్.కె. సింగ్, జస్టిస్ జె.బి. పార్దివాలా మరియు జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పునిస్తూ.. కేవలం అనుమానంతో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, మూడో డిగ్రీ చిత్రహింసలు ఉపయోగించి నేరసమ్మతి (కన్ఫెషన్) పొంది, దాని ఆధారంగా శిక్ష విధించడం న్యాయసూత్రాలకు విరుద్ధం అని స్పష్టం చేసింది.
ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. 2004 నాటి ఈ హత్యల కేసులో ప్రాసిక్యూషన్ కేవలం ఒకే ఒక్క ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలంపై పూర్తిగా ఆధారపడింది. అర్జున్ జానీ అనే వ్యక్తి రత్నై అనే మహిళపై రాత్రి 1 గంటల సమయంలో దాడి చేయడం చూశానని సదరు సాక్షి పేర్కొన్నాడు. అయితే ఆ రాత్రి అదే ప్రాంతం గుండా వెళ్లినప్పటికీ మిగతా ఇద్దరు మహిళల మృతదేహాలను తాను చూడలేదని ఆ సాక్షి తెలిపాడు. అంతేకాకుండా ఈ ఘటన గురించి వేర్వేరు సమయాల్లో వేర్వేరు వ్యక్తులకు చెప్పానని ఒప్పుకున్నప్పటికీ అతని కథనంలో తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయి.
ట్రయల్ కోర్టు శిక్ష విధించిన తర్వాత, అర్జున్ జానీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే 3,157 రోజుల ఆలస్యం జరిగిందనే కారణంతో హైకోర్టు అతని అప్పీల్‌ను విచారించకుండానే కొట్టివేసింది. ఆ సమయానికే జానీ 12 ఏళ్లకు పైగా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా 3,703 రోజుల ఆలస్యంతో అప్పీల్ దాఖలైంది. సుప్రీంకోర్టు ఈ ఆలస్యాన్ని మినహాయిస్తూ ఇది జైలు నుంచి దాఖలైన అప్పీల్ అని, నిందితుడు ఇప్పటికే చాలా కాలంగా జైలులో ఉన్నాడనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడింది.
పోలీసుల దర్యాప్తులో ఉన్న పలు లోపాలను కూడా సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. అనుమానం నేరుగా జానీ పైనే ఎందుకు వచ్చిందో పోలీసులు వివరించలేకపోయారని తెలిపింది. జానీతో నేరాన్ని ఒప్పించడానికి పోలీసులు అతడిని కొట్టారని ఒక సాక్షి అంగీకరించాడని చట్టపరంగా ఇది చెల్లుబాటు కాదని కోర్టు స్పష్టం చేసింది.
అలాగే హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని (రాయి) స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి సాక్షుల ప్రకటనలు మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO) చెప్పిన వివరాల మధ్య తీవ్రమైన పరస్పర విరుద్ధ ప్రకటనలు ఉన్నాయని గుర్తించింది.
కేవలం ప్రత్యక్ష సాక్షి ఆధారంగా శిక్ష విధించడం సాధ్యమే అయినప్పటికీ, ఆ సాక్ష్యం అత్యంత విశ్వసనీయంగా, స్థిరంగా మరియు ఇతర పరిస్థితులకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే అది చెల్లుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఈ కేసులో అలాంటి పరిస్థితులు ఏవీ లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా కొరాపుట్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సహాయంతో జానీ పునరావాసానికి మరియు అతడు తిరిగి సమాజంలో గౌరవంగా జీవించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Also Read:BB 10: బిగ్ బాస్ 10 అప్డేట్స్

