నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

3
- Advertisement -

విలన్‌గా, వైవిధ్యభరితమైన పాత్రలతో భారతీయ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1952లో ఢిల్లీలో జన్మించిన ప్రదీప్ రావత్… తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. పలు దూరదర్శన్ సీరియళ్ల ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత వెండితెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘సై’ (2004) సినిమాతో ప్రదీప్ రావత్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన ‘భిక్షు యాదవ్’ పాత్ర తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్రలోని నటనకు గాను ఆయన ఉత్తమ ప్రతినాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు, సంతోషం అవార్డులను సొంతం చేసుకున్నారు.

‘సై’ విజయం తర్వాత తెలుగులో బిజీ విలన్‌గా మారిన ఆయన పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు.భద్ర, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్,దేశముదురు, యోగి, జగడం, గజినీ, మస్కా, ఓయ్!,రెబెల్, నాయక్, బాద్‌షా, 1: నేనొక్కడినే, అల్లుడు శీను,నేను శైలజ, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

Also Read:అశ్విన్‌కు ‘సారీ’ చెప్పిన అర్ష్‌దీప్!

1985లో రాజ్ బబ్బర్ నటించిన ‘ఐత్బార్’ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన అనేక ప్రముఖ బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ‘గాయపడ్డ సింహం’ ఆయన చివరి చిత్రం. ఆయన అకస్మిక మరణం పట్ల సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించింది.

- Advertisement -