విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ మూసివేతపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా మూసేయడం లేదని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) గణబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడుతూ పలు ముఖ్యాంశాలను వెల్లడించారు.
వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూమి వాటా ఉందని, దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని పేర్కొన్నారు. ఆ విజన్ లో భాగంగానే వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ను కూడా కొనసాగించే అంశంపై సీఎం సీరియస్‌గా యోచిస్తున్నారని స్పష్టం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపైనా, వైజాగ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతపైనా వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే స్థితిలో లేరని మండిపడ్డారు.
Also Read:ICC:అఖిలేష్ రెడ్డిపై నిషేధం
అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అత్యంత అధునాతనంగా, ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ₹299 కోట్ల నిధులను కేటాయించడం అత్యంత శుభపరిణామమని ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతాయని, ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

