ఫామ్ 16 రావడం ఆలస్యమైనప్పటికీ జీతం పొందే పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌ను (ITR) సులభంగా దాఖలు చేయవచ్చు. ఐటీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు రాకుండా సరైన విధంగా ఐటీఆర్ దాఖలు చేయడానికి మీ జీతం స్లిప్పులు , ఫామ్ 26AS, ఏఐఎస్ మరియు ఇతర ఆర్థిక పత్రాలను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.
ఐటీఆర్ ప్రక్రియను ఫామ్ 16 సులభతరం చేసినప్పటికీ రిటర్న్ దాఖలు చేయడానికి ఇది కచ్చితంగా ఉండాల్సిన పత్రమేమీ కాదు. మీ యజమాని ఇంకా ఫామ్ 16 ఇవ్వలేదని ఐటీఆర్ దాఖలు చేయడాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందల్లా ఆ ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన మొత్తం ఆదాయం మరియు ఎంత పన్ను (TDS) కట్ అయిందనే స్పష్టమైన వివరాలు మాత్రమే.
ఫామ్ 16 లేకుండా ఐటీఆర్ దాఖలు చేయడానికి ముఖ్యమైన దశలు..
1. మొత్తం జీతం మరియు ఆదాయాన్ని లెక్కించండి..
మీ నెలానెలా వచ్చే జీతం స్లిప్పులు మరియు జీతం జమ అయ్యే బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్లను పరిశీలించి మొత్తం ఆదాయాన్ని లెక్కించండి.ఆ సంవత్సరంలో మీకు వచ్చిన బోనస్, ఇన్‌సెంటివ్‌లు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ (సెలవుల డబ్బులు) లేదా అరియర్స్ (పాత బాకీలు) వంటివి ఉంటే వాటిని కూడా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో చేర్చడం మర్చిపోవద్దు.
2. ఫామ్ 26AS మరియు AIS పరిశీలించండి.
మీ యజమాని కట్ చేసిన టీడీఎస్ (TDS) మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖకు జమ చేశారో లేదో సరిచూసుకోవాలి.దీని కోసం ఇన్కమ్ టాక్స్ ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి మీ Form 26AS మరియు AIS (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్) డౌన్‌లోడ్ చేసుకోండి.ఇవి మీ పాన్ (PAN) కార్డుపై ఎంత టీడీఎస్ జమ అయిందో మరియు మీకు వచ్చిన ఇతర ఆదాయాల వివరాలను చూపుతాయి.
3. తేడాలు (Mismatches) ఉంటే సరిచేసుకోండి..
ఫామ్ 26AS, AIS లలో కనిపించే టీడీఎస్ వివరాలను మీ జీతం స్లిప్పులలో ఉన్న వివరాలతో సరిపోల్చండి.ఒకవేళ ఈ వివరాల్లో ఏవైనా తేడాలు (వ్యత్యాసాలు) ఉంటే, రిటర్న్ దాఖలు చేయడానికి ముందే మీ యజమాని (కంపెనీ) దృష్టికి తీసుకెళ్లండి. దీనివల్ల భవిష్యత్తులో నోటీసులు రాకుండా మరియు రీఫండ్ లభించడంలో ఆలస్యం జరగకుండా నివారించవచ్చు.
Also Read:ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం:అభిజిత్
4. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రకటించండి..
కేవలం జీతం మాత్రమే కాకుండా ఇతర మార్గాల నుండి వచ్చిన ఆదాయాన్ని కూడా ఐటీఆర్‌లో చూపించాలి.సేవింగ్స్ ఖాతాల ద్వారా వచ్చిన వడ్డీ, ఫిక్స్డ్/రికరింగ్ డిపాజిట్ల వడ్డీ, ఐటీ రీఫండ్‌లు, అద్దె ద్వారా వచ్చే ఆదాయం, డివిడెండ్లు మరియు షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ లేదా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ (లాభాలు) వంటి వివరాలన్నీ ఫామ్ 16లో ఉన్నా లేకపోయినా ఐటీఆర్‌లో నమోదు చేయాలి.AIS ను పూర్తిగా పరిశీలించడం వల్ల ఏ రకమైన ఆదాయం కూడా పొరపాటున మిస్ కాకుండా చూసుకోవచ్చు.
5. మినహాయింపులకు సంబంధించిన ఆధారాలు సిద్ధం చేసుకోండి..
మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే పన్ను మినహాయింపుల కోసం అవసరమైన ఆధారాలను సిద్ధం చేసుకోండి. సెక్షన్ 80C కింద చేసిన పెట్టుబడుల రశీదులు..సెక్షన్ 80D కింద మెడికల్ ఇన్సూరెన్స్ రశీదులు…హోమ్ లోన్ వడ్డీ సర్టిఫికెట్లు..విరాళాల రశీదులు.ఒకవేళ మీరు కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) ఎంచుకున్నట్లయితే, అందులో లభించే ప్రత్యేక మినహాయింపులు ఏవైనా మీకు వర్తిస్తాయేమో సరిచూసుకోండి.

