పెల్లెట్ గన్‌లు..కేంద్రంపై సుప్రీం!

3
- Advertisement -

పెల్లెట్ గన్‌ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, గుంపులను అదుపు చేయడానికి వీటి వాడకాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన పోలీసు చర్యలో గాయపడిన వారికి పరిహారం అందించాలని కూడా ఈ పిటిషన్ కోరింది.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన సందర్భంగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. గుంపులను అదుపు చేసేందుకు పెల్లెట్ గన్‌లను ఉపయోగించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పెల్లెట్ గన్‌ల వినియోగానికి సంబంధించిన నిబంధనలు వాటిని ఏ పరిస్థితుల్లో ఉపయోగించవచ్చో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మాజీ స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్‌తో పాటు జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన పోలీసు చర్యలో పెల్లెట్ గన్ల దాడి వల్ల గాయపడిన ఇద్దరు వ్యక్తులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పెల్లెట్ గన్‌లను పూర్తిగా నిషేధించాలని కోరిన పిటిషనర్లను తమ పిటిషన్‌లో తగిన మార్పులు (సవరణలు) చేయాలని సుప్రీంకోర్టు కోరింది. అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే సంస్థలు పెల్లెట్ గన్‌లను ఉపయోగించడానికి పాటించే SOPలను రికార్డుల్లో నమోదు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తన సమాధానాన్ని దాఖలు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగనుంది.

శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు గుంపులను చెదరగొట్టడానికి శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలు ఉపయోగిస్తున్న పెల్లెట్ గన్‌ల వాడకాన్ని శాశ్వతంగా నిలిపివేయాలని (డీకమిషన్) పిటిషన్ డిమాండ్ చేసింది.శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం ఎంతమాత్రం తగదని మరియు ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. హింసాత్మకం కాని నిరసనలను చెదరగొట్టడానికి ఇటువంటి ఆయుధాలను ఉపయోగించడం సహేతుకమైనది కాదని, ఇది రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఉల్లంఘించడమేనని వాదించారు.గుంపులను నిర్వహించడానికి ప్రమాదం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పిటిషనర్లు కోరారు.

Also Read:ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తాం:అభిజిత్

- Advertisement -