CWG:స్వర్ణంతో మెరిసిన షర్మిల

2
- Advertisement -

కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో ఐదో రోజు భారత్ అద్భుత ప్రదర్శన చేస్తూ ఏకంగా ఆరు పతకాలను కొల్లగొట్టింది. మహిళల షాట్‌పుట్ F57 ఈవెంట్‌లో షర్మిలా ధాన్‌కర్ చారిత్రాత్మక స్వర్ణ పతకంతో మెరిసింది. అలాగే జ్ఞానేశ్వరీ యాదవ్, సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు రజత పతకాలు సాధించగా, బింధ్యారాణి దేవి, శిల్పా కే. శైల కాంస్య పతకాలను కైవసంచేసుకున్నారు. దీంతో దేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది.

మహిళల షాట్‌పుట్ F57 ఈవెంట్‌లో షర్మిలా ధాన్‌కర్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 9.81 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో కామన్‌వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా షర్మిల చరిత్ర సృష్టించింది. కాగా నైజీరియాకు చెందిన యుకేరియా ఇయియాజీ అనర్హురాలిగా ప్రకటించడంతో నాలుగో స్థానంలో నిలిచిన శిల్పా కే. శైలకు కాంస్య పతకం దక్కింది. దీంతో భారత్‌కు రెట్టింపు సంతోషం లభించింది. ఘనాకు చెందిన జినాబు ఇస్సా 8.65 మీటర్ల ప్రదర్శనతో రజతం సాధించింది.

అథ్లెటిక్స్‌లో జాతీయ రికార్డు హోల్డర్ సర్వేష్ కుషారే కూడా చరిత్ర సృష్టించారు. కామన్‌వెల్త్ గేమ్స్ పురుషుల హైజంప్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఆయన నిలిచారు. సర్వేష్ 2.25 మీటర్ల ఎత్తును దాటారు. అయితే జమైకాకు చెందిన రొమైన్ బెక్‌ఫోర్డ్ కూడా అదే ఎత్తును తక్కువ ప్రయత్నాల్లో అధిగమించడంతో కుషారే రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌కు చెందిన కిమానీ జాక్ (2.20 మీటర్లు) కాంస్యం గెలుచుకున్నారు.

వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ ఆటలో మరో మూడు పతకాలు రావడంతో మొత్తం పతకాల సంఖ్య ఆరుకు చేరింది.

Also Read:KCR:మా పెద్దిని కాపాడండి

మహిళల 53 కేజీల విభాగంలో జ్ఞానేశ్వరీ యాదవ్ రజతం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచారు. 23 ఏళ్ల జ్ఞానేశ్వరి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలతో మొత్తం 199 కేజీలు ఎత్తి తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేశారు. నైజీరియాకు చెందిన ఒనోమే ఒమోలోలా డిదిహ్ (206 కేజీలు) స్వర్ణం గెలుచుకుంది.ఆ తర్వాత మహిళల 58 కేజీల విభాగంలో బింధ్యారాణి దేవి కాంస్యం గెలుచుకున్నారు.

- Advertisement -