బాసర నుంచి త్రయంబకేశ్వర్ వరకు
99 లక్షల మొక్కలు
గోదావరికి ఇరువైపులా ప్లాంటేషన్ డ్రైవ్
కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని
జూలై 24న గ్రీన్ ఇండియా చాలెంజ్..కార్యాచరణ
వచ్చే ఐదేండ్లలో 100 కోట్ల మొక్కలే లక్ష్యం
గత ఎనిమిదేళ్లుగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో శిఖరస్థాయికి చేరుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్..మరో హరిత కార్యాచరణకు సిద్ధమైంది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి తీరం వెంట 99 లక్షల మొక్కలను నాటనుంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జూలై 24న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
గోదావరికి ఇరువైపులా..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సారి తన హరిత ఉద్యమాన్ని గోదావరి, మంజీరా నదుల సంగమ ప్రాంతం నుండి ప్రారంభించనుంది. 50 లక్షల మంది వాలంటీర్ల భాగస్వామ్యంతో, 99 లక్షల మొక్కలను నాటనుంది. అంతేకాదు అవి ఏపుగా ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత కూడా నిర్వర్తించనుంది. బాసర నుండి త్రయంబకేశ్వర్ వరకు గోదావరికి ఇరువైపులా, అలాగే మంజీరా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో ఈ ప్లాంటేషన్ డ్రైవ్ విస్తరించనుంది. ఈ ఏడాది మరాఠ్వాడా ప్రాంతంలో దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మొక్కలు నాటనుంది.
జూలై 24న జరిగే ఈ భారీ కార్యక్రమంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు మరియు సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయనున్నారు.
గోదావరికి..కృతజ్ఞతగా
3 మొక్కలు నాటడం, వాటిని 3 సంవత్సరాల పాటు సంరక్షించడం, మరో ముగ్గురిని నామినేట్ చేయడం..అనే 3-3-3 మోడల్ స్ఫూర్తి తో గత తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన హరిత హారం స్ఫూర్తినే గ్రీన్ ఇండియా చాలెంజ్ అనుసరిస్తున్నది.
2018 నుండి 4.4 కోట్ల మంది పౌరులను భాగస్వామ్యం చేసి, 19.6 కోట్ల మొక్కలను నాటింది. ప్రస్తుతం 9వ ఎడిషన్ లో భాగంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టిన రోజును పురస్కరించుకొని జూలై 24న 99 లక్షల మొక్కలకు ప్రాణం పోయనుంది. అయితే ఈ సారి ఈ ఉద్యమానికి గోదావరి నది తీరాన్ని ఎంచుకోవడం ప్రశంసనీయం. ప్రకృతిలో భాగమైన గోదావరి నదికి .. ఏదైనా తిరిగి ఇచ్చేయాలనే భావనతో 99 లక్షలు మొక్కలు నాటుతున్నామని సంతోష్ కుమార్ తెలిపారు.
“నది అంటే కేవలం నీరు మాత్రమే కాదు. దానికి జీవం పోసే అడవి, దానిపై ఆధారపడే రైతు, దానిని వారసత్వంగా పొందే భావితరాలు. వీరంతా నదిలో భాగమే. గోదావరి భారతదేశానికి నాగరికతను ఇచ్చింది. ఈ ఏడాది భారతదేశం ఆ నదికి తిరిగి కృతజ్ఞత సమర్పించుకుంటోంది” అని జోగినపల్లి సంతోష్ కుమార్ పేర్కొన్నారు.
Also Read:ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదు:ట్రంప్
2031 నాటికి 100 కోట్ల మొక్కలు..
వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఇండియా చాలెంజ్ 100 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని విధించుకున్నది. 2031 అక్టోబర్ 15న జరిగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి నాటికి ఈ సంకల్పాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నది. ” హరిత ఉద్యమం ద్వారా నేల కోత తగ్గుతాయి. నదీతీరాలకు, వ్యవసాయ భూములకు పచ్చని చెట్లు ఫెన్సింగ్ లా మారుతాయి. రైతుల ఆదాయం పెరుగుతుంది. వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడతాయి. వాతావరణంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నాం. 2031 నాటికి వంద కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తాం” అని జోగినపల్లి సంతోష్ అభిప్రాయపడ్డారు.

