బీహార్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎంపీ అభయ్ కుశ్వాహా బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరిని ఆయన అధికారిక నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుశ్వాహా…. ముఖ్యమంత్రితో భేటీ కావడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ భేటీ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం, ఇది కేవలం మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలిపింది. అయితే బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు ఈ సమావేశం జరగడంతో రాజకీయ చర్చలు మరింత ఊపందుకున్నాయి.
ఈ సమావేశంపై వస్తున్న ఊహాగానాలను ఆర్‌జేడీ కొట్టిపారేసింది. పార్టీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారి మాట్లాడుతూ…అభయ్ కుశ్వాహా తన పార్లమెంట్ నియోజకవర్గమైన ఔరంగాబాద్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశారని చెప్పారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే ఎంపీ ముఖ్యమంత్రిని కలిశారు అని తెలిపారు.
Also Read:ఒకే దేశం-ఒకే ఎన్నికలు..భిన్న వాదనలు?
అయితే ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల్లో నాయకుల వలసలు, అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలు తిరుగుబాటు,మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన పలువురు ఎంపీలు పార్టీని వీడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీహార్ నుంచి ఆర్‌జేడీకి నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు.

