కాళేశ్వరం బ్యారేజీలపై హైకోర్టు కీలక ఆదేశాలు..

2
- Advertisement -

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, మరమ్మతులకు సంబంధించిన అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA), సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కీలక వాదనలు వినిపించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు దెబ్బతిన్నప్పటికీ వాటిని మరమ్మతు చేయకుండా రాజకీయాలు చేస్తున్నారని, దీంతో గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమయ్యాయని, రైతులకు అవసరమైన నీటిని అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని NDSA నివేదికలో చేసిన సిఫార్సుల మేరకు మేడిగడ్డ బ్యారేజీని తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే మిగిలిన రిజర్వాయర్లు, బ్యారేజీలపై కూడా NDSA సమగ్ర పరిశీలన చేపట్టి నివేదిక సమర్పించాలని న్యాయవాది కోరారు.

Also Read:ఒకే దేశం-ఒకే ఎన్నికలు..భిన్న వాదనలు?

ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం మరోసారి న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఈ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

- Advertisement -