టాలీవుడ్‌లో అలజడి రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను సిట్ అధికారులు బుధవారం దాదాపు 10 గంటల ప్రశ్నించి కీలక సమాచారం సేకరించిన సంగతి తెలిసిందే. పూరీ నుంచి నార్కోటిక్ నిపుణులు బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే విచారణ అనంతరం మీడియాతో మాట్లాడని పూరి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది.
తాను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తినని, డ్రగ్సే కాదు.. అసాంఘిక కార్యక్రమాలకు ఎప్పుడూ పాల్పడలేదని, ఇకపైనా అటువంటి పనులు చేయబోనని పేర్కొన్నారు. తనకు కెల్విన్ ఎవరో తెలియలేదని, తనెప్పుడూ ఆయనను కలవలేదని అధికారులకు చెప్పానన్నారు. తనకు పోలీస్ డిపార్ట్‌మెంట్ అంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారు. వారిపై చాలా సినిమాలు కూడా చేశానన్నారు.
మీడియాపై తనకు ఎంతో గౌరవముందని అందులో పేర్కొన్న ఆయన అదే మీడియా ఇప్పుడు మా జీవితాలను నాశనం చేసిందన్నారు. కేవలం ఉహాగానాలను బేస్ చేసుకుని బ్రేకింగ్‌లు, స్పెషల్ ప్రొగ్రాంల పేరిట తమను బజారుకిడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు కుటుంబసభ్యులు బాధపడుతున్నారని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పానన్నారు. మళ్లీ వారెప్పుడు పిలిచినా వెళ్తానని పేర్కొన్నారు.
ఇక జర్నలిస్టుల ప్రేరణతో ‘ఇజం’ అనే సినిమాను తీశానని, ఇప్పుడదే జర్నలిస్టులు తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి తన తల్లీ, భార్య, పిల్లలు ఏడుస్తున్నారన్నారు. మీడియా వ్యవహరించిన తీరు తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. మీడియాలో అందరూ తన స్నేహితులేనని, వారందరూ తర్వాతైనా తనను కలుస్తారని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే సిట్ తేలుస్తుందని, అత్యుత్సాహం వద్దని హితవు పలికారు.
అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు పూరి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాగుడు అలవాటుందా? అంటూ మొదలుపెట్టిన అధికారులు డ్రగ్స్ అలవాటు గురించి ప్రశ్నించారు. కెల్విన్ ఎవరు? డ్రగ్స్ ఎప్పటి నుంచి అతడి వద్ద కొనుగోలు చేస్తున్నారు? డ్రగ్స్ తీసుకునే సమయంలో మీతో ఉండేది ఎవరు? టాలీవుడ్‌లో ఇంకా ఎంతమందికి ఇటువంటి అలవాటు ఉంది.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పూరీలో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది.