రేవంత్‌కి ఏడాది జైలు శిక్ష తప్పదు!

3
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వివాదం రేగింది. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండటం చట్టవిరుద్ధమని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం దీనికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

రెండు ఓట్ల అంశంపై అసలైన వివరణ ఇవ్వాల్సింది రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) అని, కానీ దానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన ‘ఫ్యాక్ట్ చెక్’ సంస్థ నేరుగా రేవంత్ రెడ్డి ఆఫీసు నుండే వివరణ ఇచ్చిందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు హక్కు ఉందనే విషయాన్ని సదరు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ (X) ఖాతాలో స్వయంగా పోస్ట్ చేసింది. కానీ, ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్ చేసిన గంటకే దాన్ని డిలీట్ చేశారు. అసలు ఆ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? దీని వెనుక దాస్తున్న నిజాలేంటో ప్రభుత్వం ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ఆర్‌ఎస్ ప్రవీణ్.

కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న ఓటును ఇప్పటికే తొలగించామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. అయితే, తాము అధికారిక ఓటర్ల జాబితాను మరియు ఆన్‌లైన్ రికార్డులను స్వయంగా తనిఖీ చేసినప్పుడు మాత్రం అక్కడ ఇంకా ముఖ్యమంత్రి ఓటు స్పష్టంగా చూపిస్తోందని ఆయన ఆధారాలతో సహా పేర్కొన్నారు.

- Advertisement -